
నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, అదిలాబాద్ జిల్లాల విద్యార్థుల కల సాకారమైంది. తెలంగాణ వర్సిటీలో ఇంజినీరింగ్ కాలేజీని మంజూరు చేస్తూ కాంగ్రెస్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడంతో విద్యార్థులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ ఏడాది నాలుగు కోర్సులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
బీటెక్ (సీఎస్ఈ), బీటెక్ (సీఎస్ఈ, ఏఐ), బీటెక్ (కంప్యూటర్ సైన్స్), బీటెక్ (డేటా సైన్స్) బ్రాంచ్‌లను అనుమతిస్తూ విద్యా శాఖ కార్యదర్శి యోగితారాణా గురువారంఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో బ్రాంచ్‌లో 60 మంది చొప్పున 240 మంది విద్యార్థులకు అవకాశం లభించనుంది. ఆగస్టు 5 నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానుండగా, మూడో విడత కౌన్సిలింగ్ ద్వారా సీట్లు భర్తీ చేయనున్నారు.
నాలుగు జిల్లాలకు ప్రయోజనం..
టీయూకు మంజూరైన ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీతో నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, అదిలాబాద్ జిల్లాల విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ జిల్లాల నుంచి ఏటా సుమారు 55 వేల మంది విద్యార్థులు ఇంటర్ పూర్తి చేస్తున్నారు. ఇప్పటి దాకా సర్కార్ ఇంజినీరింగ్ కాలేజీ లేక హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రైవేట్ కాలేజీలను ఆశ్రయించి, ఫీజులు భరించలేక కొందరు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. మంజూరైన ఇంజినీరింగ్ కాలేజీ లో ట్రెడిషనల్ కోర్సులు కాకుండా డిమాండ్ ఉన్న కంప్యూటర్ కోర్సులకు అనుమతించడంతో అడ్మిషన్లకు పోటీ పెరగనుంది.
ఖాళీగా ఉన్న సైన్స్ బిల్డింగ్‌లో ఇంజినీరింగ్ కాలేజీ నిర్వహించనున్నట్లు వీసీ యాదగిరిరావు తెలిపారు. ఎంసీఏ బిల్డింగ్ కూడా సిద్ధంగా ఉందన్నారు. రూ.12 కోట్ల రూసా నిధులతో నిర్మిస్తున్న బిల్డింగ్‌ను ఏడు నెలల్లో పూర్తి చేసి బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్ వచ్చే ఏడాదికి అందుబాటులో తేవాలని నిర్ణయించినట్లు వీసీ తెలిపారు. ఈ ఏడాది డే స్కాలర్ పద్ధతిలో కాలేజీని రన్ చేయనున్నామని, అడ్మిషన్లు పూర్తయ్యాక 27 మంది కొత్త
ప్రొఫెసర్లను తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
మాట నిలబెట్టుకున్న సర్కార్..
తెలంగాణ ఉద్యమ సమయం 2006లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వర్సిటీని ఏర్పాటు చేసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్, నాగ్‌పూర్ నేషనల్ హైవే పక్కన 577 ఎకరాల ల్యాండ్‌లో ఆరు కోర్సులతో వర్సిటీ ప్రారంభం కాగా, ప్రస్తుతం 31 కోర్సులు కొనసాగుతున్నాయి. ఆర్ట్స్, సైన్స్, కామర్స్, సోషల్ సైన్స్, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సులు నడుస్తున్నాయి. వీటిలో బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ వంటి 12 సెల్ప్‌ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయి. వర్సిటీ పరిధిలోని 81 పీజీ కాలేజీల్లో 5 వేల మంది, 320 డిగ్రీ కాలేజీల్లో సుమారు 50 వేల మంది విద్యార్థులు ఉంటారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో 2 వేల మంది చదువుతున్నారు. ఉస్మానియా, కాకతీయ వర్సిటీల తరువాత మూడో పెద్ద వర్సిటీగా యూజీసీ న్యాక్ ‘బీ’ గ్రేడ్ హోదా ఇచ్చింది.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ ఊసే ఎత్తలేదు. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ, పార్లమెంట్ఎన్నికలప్పుడు కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం ఫైల్ ప్రిపేర్ చేశారు. జూలై 17న ఉన్నత ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి వర్సిటీని విజిట్ చేసి ఇంజినీరింగ్ కాలేజీ మంజూరుపై సీఎం రేవంత్‌రెడ్డికి రిపోర్టు ఇచ్చారు. అప్పటికే టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, జిల్లా ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ వర్సిటీలో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరుస్తూ కాలేజీని
మంజూరు చేసింది.
విద్యకు ఫస్ట్ ప్రయారిటీ
ఇచ్చిన మాటకు కట్టుబడి ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు ప్రయారిటీ ఇస్తుంది. గత పాలకులు విద్యార్థుల బలిదానాలు కోరుకుండ్రు. కాలేజీ కోసం షబ్బీర్‌అలీ సహా జిల్లాలోని ఎమ్మెల్యేలంతా కృషి చేశారు.
మహేష్‌గౌడ్, టీపీసీసీ ప్రెసిడెంట్
బడుగు, బలహీనవర్గాలకు మేలు
బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఇంజినీరింగ్ కాలేజీతో మేలు జరగనుంది. ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సర్కార్ ఇంజినీరింగ్ కాలేజీ లేక ఇన్నాళ్లు పడిన బాధలు తొలిగినయ్. అద్భుత రిజల్టు సాధించేలా కాలేజీ నడుపుతం.
ప్రొఫెసర్ యాదగిరిరావు, వీసీ, టీయూ