
ర్యాగింగ్ ను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు చేసినా.. ర్యాగింగ్ కు బలవుతున్న విద్యార్థుల గురించి అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కాలేజీల్లో ర్యాగింగ్ ని నిషేధిస్తూ నిబంధనలు ఉన్నప్పటికీ ప్రభావం అంతంతమాత్రంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్ధి బలయ్యాడు.మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో దారుణం జరిగింది. సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజిలో ర్యాగింగ్ భూతానికి బీటెక్ స్టూడెంట్ జాదవ్ సాయితేజ బలయ్యాడు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కు చెందిన సాయితేజ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చసువుతున్నాడు. ఈ క్రమంలో సాయితేజతో గొడవపడ్డ సీనియర్స్ అతన్ని దారుణంగా కొట్టారు. ఆ తర్వాత స్థానిక యువకులతో కలిసి సాయితేజను మళ్ళీ కొట్టిన సీనియర్స్ మీకు ఫైన్ వేయాలంటూ బార్ కి తీసుకెళ్లి రూ. 15 వేలు బిల్లు చేసి.. ఇంకా కావాలంటూ టార్చర్ చేశారు.
మేము పేదవాళ్లమని... తమ దగ్గర డబ్బులు లేవని సాయితేజ ఎంత చెప్పినా వినకుండా టార్చర్ పెట్టారు సీనియర్స్. దీంతో హాస్టల్ కి వెళ్లిన సాయితేజ తండ్రికి సెల్ఫీ వీడియో పెట్టి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయితేజ మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తమ కుమారుడి మరణానికి కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యమేనని ఆరోపిస్తున్నారు తల్లిదండ్రులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.