హైదరాబాద్ చిలకలగూడలో దారుణం.. ప్రేమిస్తున్నాడని ఇంజినీరింగ్ స్టూడెంట్ హత్య..రోడ్డుపై కత్తులతో పొడిచి మర్డర్

హైదరాబాద్ చిలకలగూడలో దారుణం.. ప్రేమిస్తున్నాడని ఇంజినీరింగ్ స్టూడెంట్ హత్య..రోడ్డుపై కత్తులతో పొడిచి మర్డర్
  • 17 పోట్లు పొడవడంతో మృతి
  • చిలకలగూడ పరిధిలో ఘటన 

పద్మారావు నగర్, వెలుగు:  తమకు సంబంధించిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, చెప్పినా వినడం లేదని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంజినీరింగ్​స్టూడెంట్​ను అందరూ చూస్తుండగా కత్తులతో పొడిచి దారుణంగా చంపేశారు. అల్వాల్ ప్రాంతానికి చెందిన యవాన్ (25) ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. సీతాఫల్​మండికి చెందిన ఓ యువతితో నాలుగేండ్లుగా ప్రేమలో ఉన్నాడు. సీతాఫల్​మండి ఇందిరానగర్​లో యవాన్​కు ఫ్రెండ్స్​ఉండడంతో వారిని కలిసేందుకు తరచూ వస్తుండేవాడు. తను ప్రేమించిన యువతిని కూడా కలుస్తూ ఉండేవాడు. ఈ ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకున్న అమ్మాయి బంధువులు యావన్ కు పలుమార్లు వార్నింగ్ ఇచ్చారు. 

గురువారం యావన్ ఇందిరానగర్ లోని ఫ్రెండ్స్​తో కలిసి అరుగుపై కూర్చుని క్రికెట్​చూస్తున్నాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి బావ, సోదరుడు మరో ముగ్గురితో కలిసి కత్తులతో ఇందిరానగర్ వచ్చారు. క్రికెట్​చూస్తున్న యావన్​ను గొంతుతోపాటు పలుచోట్ల విచక్షణారహితంగా పొడిచారు. మొత్తం 17 చోట్ల పొడవడంతో తీవ్ర గాయాలై రక్తపు మడుగులో పడిపోయాడు. గమనించిన స్థానికులు గాంధీ దవాఖానకు తరలించగా, మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు. పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించి, నిందితుల కోసం గాలిస్తున్నారు.