
జింబాబ్వేతో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఈ మ్యాచ్ గురువారం (మే 22) నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో ప్రారంభం కానుంది. 2003 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై జింబాబ్వే తొలి టెస్ట్ ఆడబోతుంది. ఏకైక టెస్ట్ కోసం ఇంగ్లాండ్ జట్టు తమ ఫాస్ట్ బౌలర్లకు రెస్ట్ ఇచ్చింది. కార్స్, వోక్స్, పాట్స్, ఓలీ స్టోన్ లేకుండానే జింబాబ్వేతో టెస్ట్ ఆడనుంది. బ్యాటింగ్ ఆర్డర్ లో మాత్రం ఎలాంటి ప్రయోగాలు చేయలేదు.
ఓపెనర్లుగా క్రాలీ, డకెట్ ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నారు. పోప్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. స్టార్ బ్యాటర్ రూట్, యువ సంచలనం హ్యారీ బ్రూక్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు. గాయం నుంచి కోలుకొని ఇంగ్లాండ్ జట్టులో చేరిన కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆరో స్థానంలో దిగుతాడు. వికెట్ కీపర్ బ్యాటర్ గా జెమీ స్మిత్ కొనసాగుతారు. ఏకైక స్పిన్నర్ గా షోయబ్ బషీర్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకున్నాడు. అట్కిన్సన్, సామ్ కుక్,జోష్ టంగ్ పేస్ బౌలింగ్ బాధ్యతలను పంచుకుంటారు.
టీమిండియాతో జూన్ 20 నుంచి జరగనున్న 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను ఇంగ్లాండ్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఓ వైపు భారత జట్టు ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉంటే.. మరోవైపు ఇంగ్లాండ్ ఇప్పటి నుంచే సిరీస్ ఎలా గెలవాలనే వ్యహాలు రచిస్తోంది. ఈ మెగా సిరీస్ కు భారత్ కుర్రాళ్లతో బరిలోకి దిగుతుంటే ఇంగ్లాండ్ మాత్రం పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతుంది. దీంతో ఈ సిరీస్ గెలవడం టీమిండియాకు అతి పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం ఆ జట్టులో అందరు ప్లేయర్స్ ఫిట్ గా ఉండడం కలిసి వచ్చే అవకాశం. టీమిండియాతో ఆడబోయే సిరీస్ కు త్వరలో ఇంగ్లాండ్ స్క్వాడ్ ను ప్రకటించనున్నారు.
ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్, గస్ అట్కిన్సన్, సామ్ కుక్, జోష్ టంగ్యూ, షోయబ్ బషీర్.