రఫ్పాడించిన రాయ్..బంగ్లాపై ఇంగ్లాండ్ గ్రాండ్ విక్టరీ

రఫ్పాడించిన రాయ్..బంగ్లాపై ఇంగ్లాండ్ గ్రాండ్ విక్టరీ

కార్డిఫ్‌‌:  గత మ్యాచ్‌‌లో పాకిస్థాన్‌‌ చేతిలో కంగుతున్న టైటిల్‌‌ ఫేవరెట్‌‌ ఇంగ్లండ్‌‌ మళ్లీ గెలుపు బాట పట్టింది. ప్రపంచకప్‌‌లో తమను రెండుసార్లు ఓడించిన బంగ్లాదేశ్‌‌పై ఇంగ్లిష్‌‌ టీమ్‌‌ పంజా విసిరింది. ముఖ్యంగా 2015లో బంగ్లా చేతిలోనే ఓడి అవమానకర రీతిలో వరల్డ్‌‌కప్‌‌ నుంచి నిష్క్రమించిన మోర్గాన్‌‌సేన ఈసారి ఆ జట్టును చిత్తుగా ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. శనివారం జరిగిన  మ్యాచ్‌‌లో ఇంగ్లండ్‌‌ 106 పరుగుల తేడాతో బంగ్లాపై  భారీ విజయాన్ని దక్కించుకుంది. ఓపెనర్‌‌ జేసన్‌‌ రాయ్‌‌ (121 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లతో 153) భారీ సెంచరీకి జోస్‌‌ బట్లర్‌‌ (44 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 64), జానీ బెయిర్‌‌స్టో (50 బంతుల్లో 6 ఫోర్లతో 51) హాఫ్‌‌ సెంచరీలు తోడవడంతో టాస్‌‌ ఓడి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌కు దిగిన ఇంగ్లండ్‌‌ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది.  వరల్డ్‌‌కప్‌‌ టోర్నీల్లో ఇంగ్లండ్‌‌కిదే అత్యధిక స్కోరు.  బంగ్లా బౌలర్లలో మెహదీహసన్‌‌ మిరాజ్‌‌( 2/67),  సైఫుద్దీన్‌‌(2/78) రెండేసి వికెట్లు తీశారు. ఛేజింగ్‌‌లో 48.5 ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్‌‌ 280కి ఆలౌటైంది. షకీబల్‌‌హసన్‌‌(119 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌‌తో 121) సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. ఇంగ్లండ్‌‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌‌ (3/29), బెన్‌‌ స్టోక్స్‌‌ (3/23) మూడేసి వికెట్లు తీశారు. మార్క్‌‌వుడ్‌‌కు రెండు వికెట్లు దక్కాయి. రాయ్‌‌కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ది మ్యాచ్‌‌’ అవార్డు దక్కింది.

జేసన్​ ధనాధన్​

ఇంగ్లండ్‌‌ ఓపెనర్‌‌ జేసన్ రాయ్‌‌ ధనాధన్‌‌ ఆటతో బంగ్లా బౌలర్లను రఫ్ఫాడించాడు. ఐదు సిక్సర్లు, 14 బౌండరీలతో మోర్తాజా సేనకు చుక్కలు చూపించి భారీ శతకంతో చెలరేగిపోయాడు. సెంచరీకి 92 బంతులు తీసుకున్న రాయ్‌‌ తర్వాతి 53 పరుగులను 29 బంతుల్లో చేశాడంటే  అతను ఏ స్థాయిలో చెలరేగాడో అర్థం చేసుకోవచ్చు. డబుల్‌‌ సెంచరీ బాదేలా కనిపించిన రాయ్‌‌ దూకుడు చూస్తే ఓ దశలో ఇంగ్లండ్‌‌ వరల్డ్‌‌రికార్డు స్కోరు నమోదు చేస్తుందేమో అనిపించింది. 153 రన్స్‌‌తో రాయ్‌‌ సరిపెట్టినా మిగిలిన బ్యాట్స్‌‌మన్‌‌ కూడా సత్తా చాటడంతో ఇంగ్లిష్‌‌ జట్టు ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్నే ఉంచింది. టాస్‌‌ ఓడి  ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌కు దిగిన ఇంగ్లండ్‌‌కు ఓపెనర్లు రాయ్‌‌, బెయిర్‌‌స్టో  తొలి వికెట్‌‌కు 128 రన్స్‌‌ జోడించి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేసుకున్న బెయిర్‌‌స్టోను పెవిలియన్‌‌కు చేర్చిన కెప్టెన్‌‌ మోర్తాజా బంగ్లాకు తొలి బ్రేక్‌‌ ఇచ్చాడు. మిరాజ్‌‌ కళ్లు చెదిరే క్యాచ్‌‌ అందుకోవడంతో జానీ నిష్క్రమించాడు. వన్‌‌డౌన్‌‌లో వచ్చిన జో రూట్‌‌(21) తక్కువ స్కోరే చేసినా.. అతనితో కలిసి రాయ్‌‌ రెండో వికెట్‌‌కు 77 రన్స్‌‌ జోడించి జట్టును భారీ స్కోరు దిశగా నడిపాడు. ఈ క్రమంలో రాయ్‌‌ కెరీర్‌‌లో తొమ్మిదో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రూట్‌‌ తర్వాత క్రీజులోకి వచ్చిన బట్లర్‌‌ కూడా ధనాధన్‌‌ బ్యాటింగ్‌‌ చేశాడు. మిరాజ్‌‌ వేసిన 35 ఓవర్‌‌లో హ్యాట్రిక్‌‌ సిక్స్‌‌లు కొట్టి 150 మార్కును దాటిన రాయ్‌‌ మరో సిక్సర్‌‌కు ట్రై చేసి ఎక్స్‌‌ట్రా కవర్‌‌లో మోర్తాజాకు సులువైన క్యాచ్‌‌ ఇచ్చాడు. అయితే కెప్టెన్‌‌ మోర్గాన్‌‌(35) అండతో దాడి కొనసాగించిన బట్లర్‌‌ స్కోరు వేగం తగ్గకుండా చూశాడు. 45 ఓవర్లు ముగిసే సరికి 324/3తో ఇంగ్లండ్‌‌ పటిష్టమైన స్థితిలో నిలిచిన దశలో బంగ్లా బౌలర్లు ఒక్కసారిగా పుంజుకున్నారు. వరుస ఓవర్లలో బట్లర్‌‌, మోర్గాన్‌‌,  స్టోక్స్‌‌(6)ను పెవిలియన్‌‌ చేర్చారు. అయితే  చివర్లో  ఫ్లంకెట్‌‌ (9 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌‌తో 27 నాటౌట్‌‌), క్రిస్‌‌ వోక్స్‌‌ (8 బంతుల్లో 2 సిక్సర్లతో 18 నాటౌట్‌‌) మెరుపులు మెరిపించి జట్టు స్కోరును 400కు చేరువ చేశారు.

షకీబ్‌‌ సెంచరీ కొట్టినా..

భారీ ఛేజింగ్‌‌లో బంగ్లాదేశ్‌‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. నాలుగో ఓవర్‌‌లోనే  సౌమ్య సర్కార్‌‌(2) వికెట్‌‌ కోల్పోయిన బంగ్లా 12వ ఓవర్‌‌లో మరో ఓపెనర్‌‌ తమీమ్‌‌ ఇక్బాల్‌‌(19) వికెట్‌‌ కోల్పోయింది. ఈ దశలో వన్‌‌డౌన్‌‌లో వచ్చిన షకీబల్‌‌, ముష్ఫికర్‌‌ రహీమ్‌‌(44)తో కలిసి స్కోరుబోర్డును నడిపించాడు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంత సేపు బంగ్లా అవకాశాలు సజీవంగా ఉన్నాయి. స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టిన ఈ జోడీ మూడో వికెట్‌‌కు 106 పరుగులు జోడించింది. హాఫ్‌‌ సెంచరీకి చేరువైన ముష్ఫికర్‌‌ను ఇన్నింగ్స్‌‌ 29వ ఓవర్‌‌లో ప్లంకెట్‌‌ ఔట్‌‌ చేశాడు. మూడు బంతుల వ్యవధిలో మిథున్‌‌(0)ను రషీద్‌‌ ఔట్‌‌ చేశాడు. దీంతో ఇంగ్లండ్‌‌ మ్యాచ్‌‌పై పట్టుబిగించింది. ఆ తర్వాత 33వ ఓవర్‌‌లో షకీబ్‌‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెరీర్‌‌లో అతనికిది ఎనిమిదో సెంచరీ. భారీ స్కోరు చేసేలా కనిపించిన షకీబ్‌‌ను 40వ ఓవర్‌‌లో స్టోక్స్‌‌ బౌల్డ్‌‌ చేశాడు. దీంతో బంగ్లా ఆశలు గల్లంతయ్యాయి. చివర్లో మహ్మూదుల్లా(28), మొసద్దెక్‌‌(26) పోరాడి ఓటమి అంతరాన్ని తగ్గించగా, ఇంగ్లిష్‌‌ బౌలర్లు టపాటపా వికెట్లు తీసి బంగ్లా కథను ముగించారు.