T 20World cup2026 : ఇట్లాడితే ఎట్ల!..టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా తడబాటు

T 20World cup2026 : ఇట్లాడితే ఎట్ల!..టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా తడబాటు

 

  • టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా తడబాటు
  • నిరాశపరుస్తున్న బ్యాటర్లు.. పట్టు చేజారుస్తున్న బౌలర్లు


టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌కు ముందు టీమిండియా ఫామ్ చూసి ప్రత్యర్థులు వణికిపోయారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 240/6, 271/5, 238/7 వంటి భారీ స్కోర్లు కొట్టిన ఇండియా..  ఛేజింగ్‌‌‌‌లో 15.2 ఓవర్లలో 209/3, 10 ఓవర్లలోనే 155/2 టార్గెట్లను ఊదిపారేసింది. న్యూజిలాండ్‌‌‌‌తో సిరీస్‌‌‌‌లో, సౌతాఫ్రికాతో వామప్ మ్యాచ్‌‌‌‌లోనూ బ్యాటింగ్, బౌలింగ్‌‌‌‌లో టీమిండియా ఆధిపత్యమే. ఆడిన ప్రతి మ్యాచ్‌‌‌‌లోనూ పరుగుల సునామీ సృష్టించిన కుర్రాళ్లు హీరోలుగా వెలుగొందారు. కానీ, మెగా టోర్నీలో అసలైన పరీక్షకు  వచ్చేసరికి సీన్‌‌‌‌ రివర్సైంది. అమెరికా, నెదర్లాండ్స్ వంటి పసికూనలపై గెలిచేందుకు చెమటోడ్చిన ఇండియా.. సౌతాఫ్రికా వంటి బలమైన జట్టు ఎదురవగానే ఘోరంగా కుప్పకూలింది.  అసలు ఆడుతున్నది టీమిండియానేనా అన్నట్టుగా సూర్యసేన పరిస్థితి తయారైంది. సఫారీల చేతిలో 76 రన్స్ తేడాతో చిత్తవడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. రన్‌‌‌‌రేట్ మైనస్‌‌‌‌ -3.8కి పడిపోవడం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. మిగిలిన రెండు మ్యాచ్‌‌‌‌ల్లో జింబాబ్వే, వెస్టిండీస్‌‌‌‌పై భారీ తేడాతో నెగ్గాల్సిన అవసరం ఏర్పడింది. 

ఎందుకిలా..

మెగా టోర్నీకి ముందు జట్టులో చెప్పుకోవడానికి పెద్ద సమస్యలేవీ కనిపించలేదు. కానీ, ఇప్పుడు అన్ని విభాగాల్లో ఇబ్బందులే. జట్టుకు వెన్నెముకగా నిలవాల్సిన ఓపెనింగ్ జోడీ, టాపార్డర్ ఇప్పుడు ప్రధాన బలహీనతగా మారింది. అమెరికాతో మ్యాచ్‌‌‌‌లో 46 రన్స్‌‌‌‌కే 4 వికెట్లు కోల్పోవడం ఒక హెచ్చరిక అయితే, సౌతాఫ్రికాపై 31 రన్స్‌‌‌‌కు 3 వికెట్లు పడటం కోలుకోలేని దెబ్బగా మారింది.  వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ అభిషేక్ శర్మ  మూడు సున్నాల తర్వాత సౌతాఫ్రికాపై 15 రన్స్ చేసినా, అది జట్టు అవసరాలకు ఏమాత్రం సరిపోలేదు. ఆసియా కప్ హీరో తిలక్ వర్మ కూడా ఒత్తిడిలో చిత్తవుతున్నాడు. 

నమీబియాపై ఇషాన్– శాంసన్ చేసిన 25 రన్సే ఈ టోర్నీలో మన బెస్ట్ ఓపెనింగ్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక, కెప్టెన్ సూర్యకుమార్ తన మార్కు  360- డిగ్రీల ఆటను వదిలేసి వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యత ఇస్తుండటంతో రన్ రేట్ దారుణంగా పడిపోతోంది. మరోవైపు రింకూ సింగ్ ఫినిషర్‌‌‌‌గా సక్సెస్ అవ్వడం లేదు. గత పోరులో రింకూ చివరి వరకు క్రీజులో ఉండి కొన్ని రన్స్ చేస్తే  ఇండియా రన్‌‌‌‌రేట్ అంతగా పడిపోయేది కాదు. దీన్నేమీ పట్టించుకోకుండా అతను గుడ్డిగా షాట్ ఆడి క్యాచ్ ఇచ్చేశాడు.  బుమ్రా మినహా బౌలర్లు ఎక్కువ రన్స్‌‌‌‌ ఇస్తున్నారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం జట్టును దెబ్బతీస్తోంది. గత పోరులో  సౌతాఫ్రికాను 20/3తో నిలిపినా.. అదే ఒత్తిడిని కొనసాగించలేకపోవడం.. 11 ఎక్స్‌‌‌‌ట్రాలు ఇవ్వడం, లాస్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా 20 రన్స్ సమర్పించుకోవడం ఓటమికి  కారణలు. ఇక, అహ్మదాబాద్ వికెట్‌‌‌‌పై అవగాహన ఉన్న లోకల్ స్టార్ అక్షర్ పటేల్‌‌‌‌ను కాదని, కేవలం ప్రత్యర్థి జట్టులో లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారని సుందర్‌‌‌‌ను తీసుకోవడం  కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్య చేసిన  పెద్ద తప్పిదం అనొచ్చు.  బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌‌‌‌లోనూ సుందర్ తేలిపోయాడు. వైస్ కెప్టెన్ అక్షర్‌‌‌‌ను బెంచ్ మీద కూర్చోబెట్టడం జట్టు సమతూకాన్ని దెబ్బతీసింది. 

ఇప్పుడేం చేయాలె..

ఇండియా బ్యాటర్లు ఫస్ట్ బాల్‌‌‌‌ నుంచే భారీ షాట్లు కొట్టడానికి అలవాటు పడ్డారు. కానీ పిచ్ సహకరించనప్పుడు ఇన్నింగ్స్‌‌‌‌ను నిర్మించడంలో తడబడుతున్నారు. గత రెండేండ్లుగా పవర్ ప్లేలో ఓవర్‌‌‌‌కు 10 రన్‌‌‌‌రేట్‌‌‌‌తో  స్పీడ్‌‌‌‌గా ఆడుతున్న ఇండియా ఇప్పుడు స్లో పిచ్‌‌‌‌లపై ఇబ్బంది పడుతోంది. పిచ్ కాస్త నెమ్మదించినా,  బాల్ కాస్త లేట్‌‌‌‌గా బ్యాట్‌‌పైకి వస్తున్నా బ్యాటర్లు  ఫెయిలవుతున్నారు. సౌతాఫ్రికా బౌలర్లు యాన్సెన్, మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌ ఈ బలహీనతలను ఎండగట్టారు. కాబట్టి బ్యాటర్లు తమ పంథా మార్చుకుని, పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా ఆడతారనే దానిపైనే ఇండియా భవిష్యత్తు ఆధారపడి ఉంది. జట్టు మెయిన్‌‌‌‌ వీక్‌‌‌‌నెస్ అయిన  ఓపెనింగ్‌‌‌‌ను ముందుగా సరిచేయాలి.  

టాపార్డర్‌‌‌‌లో లెఫ్టాండ్ బ్యాటర్ల ఆధిపత్యాన్ని తగ్గించి శాంసన్‌‌‌‌ వంటి అనుభవం ఉన్న రైట్ హ్యాండ్ బ్యాటర్‌‌‌‌ను జట్టులోకి తీసుకుంటే  ప్రత్యర్థి బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్‌‌‌‌ను దెబ్బతీయొచ్చు. ఓపెనర్లు కనీసం 6 ఓవర్ల పాటు క్రీజులో ఉండే ప్రయత్నం చేస్తే  కెప్టెన్‌‌‌‌ సూర్య తనదైన శైలిలో  హిట్టింగ్‌‌‌‌కు దిగే స్వేచ్ఛ లభిస్తుంది.  అక్షర్ పటేల్ బ్యాటింగ్, బౌలింగ్‌‌‌‌లో జట్టుకు బ్యాలెన్స్ ఇస్తాడు.   బౌలింగ్‌‌లో ఎక్స్‌‌‌‌ట్రాలు ఇవ్వడం..  క్యాచ్‌‌‌‌లను జారవిడవడం వంటి చిన్న పొరపాట్లు మెగా టోర్నీలో భారీ మూల్యాన్ని చెల్లించుకునేలా చేస్తాయి కాబట్టి జట్టు ఈ అంశాలపైనా ఫోకస్ పెట్టాలి.  ఏదేమైనా కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ తర్వాత ఏర్పడిన లోటను భర్తీ చేయడం అంత ఈజీ కాదని తాజా మ్యాచ్‌‌‌‌లు నిరూపిస్తున్నాయి.  అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు తమ పాత ఫామ్‌‌‌‌ను అందిపుచ్చుకోకపోతే డిఫెండింగ్ చాంపియన్ ఇండియా సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టే ప్రమాదం ఉంది. కాబట్టి  సూర్యసేన గత ఓటమి నుంచి వెంటనే తేరుకొని మళ్లీ మెరిపించాలని ఆశిద్దాం.