Women's ODI World Cup 2025: 10 మంది సింగిల్ డిజిట్.. ఇంగ్లాండ్ దెబ్బకు సౌతాఫ్రికా 69 పరుగులకే ఆలౌట్

Women's ODI World Cup 2025: 10 మంది సింగిల్ డిజిట్.. ఇంగ్లాండ్ దెబ్బకు సౌతాఫ్రికా 69 పరుగులకే ఆలౌట్

మహిళల వరల్డ్ కప్ సౌతాఫ్రికాకు ఆడుతున్న తొలి మ్యాచ్ లో చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం (అక్టోబర్ 3) గౌహతి వేదికగా బర్సపారా క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్ మహిళలతో జరుగుతున్న మ్యాచ్ లో బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమైంది. మొదట బ్యాటింగ్ చేసిన సఫారీ మహిళల జట్టు ఊహించని విధంగా 20.4 ఓవర్లలో కేవలం 69 పరుగులకే ఆలౌటైంది. వన్డేల్లో సౌతాఫ్రికా జట్టుకు ఇది మూడో అత్యల్ప స్కోర్. అంతేకాదు సౌతాఫ్రికా మహిళా వన్డే క్రికెట్ చరిత్రలో అతి తక్కువ ఓవర్లు ఆడిన చెత్త రికార్డును మూట కట్టుకుంది. 

మహిళల వరల్డ్ కప్ లో వన్ ఆఫ్ ది హాట్ ఫేవరేట్స్ సౌతాఫ్రికాకు తొలి మ్యాచ్ లోనే ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం ఆ జట్టు కాన్ఫిడెంట్ ను దెబ్బ తీస్తుంది. మ్యాచ్ ప్రారంభమైన గంటన్నరలోనే సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగియడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సఫారీల జట్టులో ఏకంగా 10 మంది సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం షాకింగ్ కు గురి చేస్తుంది. వికెట్ కీపర్ సినాలో జాఫ్తా 22 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలవగా.. మిగిలినవారు సింగిల్ డిజిట్ కే పెవిలియన్ కు చేరారు. లింసే స్మిత్ మూడు వికెట్లు తీసుకుంది. నాట్ స్కైవర్-బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్, షార్లెట్ డీన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. లారెన్ బెల్ కు ఒక వికెట్ దక్కింది.     

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా ఆరంభం నుంచి వికెట్లను కోల్పోతూనే వచ్చింది. లారా వోల్వార్డ్ (5), టాజ్మిన్ బ్రిట్స్(5) సునే లూస్ (2), మారిజాన్ కాప్ (4) పెవిలియన్ కు క్యూ కట్టడంతో 19 పరుగులకే సఫారీ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మిడిల్ ఆర్డర్ ఆడుకుంటారనుకుంటే వారు కూడా చేతులెత్తేశారు. వికెట్ కీపర్ సినాలో జాఫ్తా ఒక ఎండ్ లో ఉన్నప్పటికి మిగిలిన వారు వచ్చామా వెళ్ళామా అనే రీతిలో ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. దీంతో 69 పరుగులకే ఆలౌటైంది. 70 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ వికెట్ కోల్పోకుండా 15 ఓవర్లలో 70 పరుగులు చేసి గెలిచింది.