రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్..ఐపీఎల్ 2024 నుంచి వైదొలిగిన ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్

రాజస్థాన్ రాయల్స్‌కు బిగ్ షాక్..ఐపీఎల్ 2024 నుంచి వైదొలిగిన ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్

ఐపీఎల్ 2024 హడావుడి అప్పుడే మొదలైంది. రిటైన్, ట్రేడింగ్ పై ప్రస్తుతం దృష్టి పెట్టిన ఫ్రాంచైజీలు వచ్చే నెలలో వేలంలో ఎవరిని తీసుకుంటారో ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడేందుకు స్టార్ ప్లేయర్లు తమ పేర్లను ఇవ్వడంతో  ఐపీఎల్ 2024 హైప్ పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఇంగ్లాండ్ ప్లేయర్లు మాత్రం ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపించడం లేదు. స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి దూరమవ్వగా.. తాజాగా ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఐపీఎల్ నుంచి వైదొలిగాడు.

జో రూట్ నవంబర్ 25, శనివారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్‌లో ఆడడం లేదని రాజస్థాన్ రాయల్స్ వెల్లడించింది. ఈ స్టార్ ఆటగాడు గురువారమే IPL 2024 నుండి వైదొలగాలని నిర్ణయిచుకున్నట్టు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం తెలియజేసింది. 2024లో టెస్టు క్రికెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలని రూట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రూట్ నిర్ణయాన్ని గౌరవిస్తామని.. అతని భవిష్యత్ బాగుండాలని కోరుకుంటాం అని రాజస్థాన్ జట్టు డైరెక్టర్ కుమారా సంగక్కర తెలియజేశాడు. 

32 ఏళ్ళ రూట్ ఐపీఎల్ 2023లో భాగంగా తొలిసారి వేలంలో కోటి రూపాయలకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. ఈ ఐపీఎల్ లో మూడు మ్యాచ్ లు ఆడే అవకాశం మాత్రమే వచ్చింది. సంజు శాంసన్, హెట్ మేయర్, పడికల్ లాంటి ఆటగాళ్లు మిడిల్ ఆర్డర్ లో ఉండటం వలన రూట్ కు తుది జట్టులో అవకాశం దక్కడం కష్టంగా మారింది. మొత్తానికి అనుకోకుండా ఐపీఎల్ కు వచ్చిన రూట్ అనూహ్యంగా  ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు.