ఉమ్మడి జిల్లా మొత్తాన్ని ఒకే జోన్​లో ఉంచాలి : ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి

ఉమ్మడి జిల్లా మొత్తాన్ని ఒకే జోన్​లో ఉంచాలి :   ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు:  ఉమ్మడి జిల్లా మొత్తాన్ని ఒక జోన్​లో ఉండేలా చేస్తేనే ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్​ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసమని చెప్పారు. కానీ, గత ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోతో చాలా మంది ఉద్యోగులు సొంత జిల్లాకు దూరంగా వెళ్లి కష్టాలు పడుతున్నారని వివరించారు. ఆదివారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. 

జీవో 317తో పాటు జీవో 46లను సమీక్షించేందుకు సబ్​ కమిటీ వేయడం హర్షణీయమని జీవన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్​చివరి వారంలోపు కమిటీ నివేదిక ఇచ్చే అవకాశముందన్నారు.  రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు జీవోల్లో సవరణలు ఉంటాయన్నారు. ఉమ్మడి కరీంనగర్​ జిల్లాను నాలుగు జోన్లుగా విభజించారని, దీంతో జూనియర్లు చేరిన చోట ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉండవని వెల్లడించారు.  

సీనియర్లందరూ ఒకే చోటుకు వెళ్తే ఆ జోన్​లో పదవీ విరమణ జరిగి, ఉద్యోగ ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు. కాగా, ఆరు గ్యారంటీల్లో రెండింటిని అమలు చేస్తున్నామని, మరో రెండింటిని త్వరలో ప్రారంభించబోతున్నామని చెప్పారు.