నల్లమలను చూసొద్దాం..! ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులకు ఎంట్రీ షురూ

నల్లమలను చూసొద్దాం..! ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులకు ఎంట్రీ షురూ
  • ఈనెల1 నుంచి అందుబాటులోకి టైగర్​ సఫారీ సేవలు 
  • సందర్శకులను కనువిందు చేయనున్న వన్యప్రాణులు

అమ్రాబాద్, వెలుగు: నల్లమల అటవీ ప్రాంతాల సందర్శనకు ప్రకృతి ప్రేమికులు, పర్యాటకుల కోసం సఫారీ సేవలు షురూ అయ్యాయి. మూడు నెలల పాటు వన్యప్రాణుల సంతానోత్పత్తి సమయంలో బంద్ పెట్టారు.  ఈనెల1 నుంచి  మళ్లీ నల్లమల అడవి, అమ్రాబాద్​టైగర్​రిజర్వ్​(ఏటీఆర్) లోని పర్యాటక ప్రాంతాలను చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  దట్టమైన అడవి మధ్యలోంచి ప్రవహించే కృష్ణానదిని చుట్టేసే అందమైన కొండలు, కనువిందు చేసే జలపాతాలు, వన్యప్రాణులు, పులులు, చిరుతలను అతి సమీపంలోంచి చూసేందుకు అటవీశాఖ అవకాశం కల్పిస్తోంది. 

నల్లమల అటవీలో  కృష్ణాతీరంలోని సోమశిల నుంచి బ్రహ్మగిరి వరకు నర్సింహుని వాగు, లొద్ది మల్లయ్య, అంతర్ గంగ, ఆక్టోపస్​వ్యూ పాయింట్​, వజ్రాల మడుగు, భైరవకోన, గీసుగండి, గున్నపెంట, గుండం, పెద్దమ్మగుడి, మార్కండేయ గుడి వంటి చూడాల్సిన ప్రాంతాలెన్నో ఉన్నాయి. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి నల్లమల టూరిజం సర్క్యూట్​ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 

దట్టమైన అడవిలోని ప్రదేశాలను చూడాలంటే.. 

తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటలకులతో  శ్రీశైలం ఉత్తర ద్వారం ఉమా మహేశ్వర క్షేత్రం సందడిగా మారుతుంది. అటవీశాఖ పర్మిషన్లతో ఏటీఆర్​లోని ఫర్హాబాద్​ వ్యూ పాయింట్​, భౌరాపూర్​, చెంచు పెంటలు, ప్రతాపరుద్రుడి కోటను బుధవారం నుంచి చూడొచ్చు. వీటితో పాటు  మద్దిమడుగు, రాయలగండి వంటి ప్రాంతాలను చూసేందుకు అనుమతించారు. అప్పాపూర్​పెంట నుంచి ఫర్హాబాద్​వ్యూ పాయింట్, ట్రెక్కింగ్, అడవిలో నైట్​క్యాంప్​కు అవకాశం కల్పించారు. తెలంగాణ పరిధిలో చారిత్రక అక్కమహాదేవి గుహల సందర్శనను కూడా అందుబాటులోకి తెచ్చారు. 

11వ శతాబ్దంలో కృష్ణాతీరంలో వెలుగు చూసిన అక్కమహాదేవి గుహలు సహజ శిలాతోరణంగా ఏర్పడ్డాయి. అక్కమహాదేవి గుహలకు ప్రస్తుతం బ్రహ్మగిరి(దోమలపెంట) నుంచి బోటింగ్​ సదుపాయం కల్పిస్తున్నారు. నల్లమల దట్టమైన అడవి మధ్యలో ఉండే దత్త పాదుకలు, కదళీవనానికి కూడా ఇక్కడి నుంచే వెళ్లాల్సి ఉంటుంది.  

శ్రీశైలం ఉత్తర ద్వారంగా పేరున్న ఉమా మహేశ్వర క్షేత్రం,  భోగ మహేశ్వర క్షేత్రం ఆధ్మాత్మిక కేంద్రాలుగా ఉన్నాయి.  ప్రస్తుతం మద్దిమడుగు వరకు మాత్రమే పర్యాటకులు, భక్తులను అనుమతిస్తుండగా, మల్లెల తీర్థం, లొద్ది మల్లయ్య, సలేశ్వరం జలపాతాలను చూసేందుకు అటవీశాఖ అనుమతిస్తే బయటి ప్రపంచానికి సరికొత్త నల్లమల పరిచయమవుతుంది. 

ఆన్​లైన్​లో బుకింగ్ సేవలు 

అమ్రాబాద్  టైగర్ రిజర్వ్ లో సఫారీ, ట్రెక్కింగ్, టైగర్ స్టే సేవలు ప్రారంభించినట్టు డీఎఫ్ఓ రోహిత్ గోపిడి తెలిపారు. ఇందుకు వెబ్ సైట్ https://amrabadtigerreserve.com/ ద్వారా లేదా 9154281766 నంబర్ కు ఫోన్ చేసి ముందస్తు బుకింగ్​చేసుకోవచ్చని సూచించారు.  ఫర్హాబాద్ నుంచి వచ్చే సందర్శకులకు ఒక సఫారీ వెహికల్ లో 7 మందిని అనుమతిస్తామని పేర్కొన్నారు. 

గైడ్ అందుబాటులో ఉంటాడని, టూరిస్టు లు రూ.100 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఏటీఆర్ ప్లాస్టిక్ ఫ్రీ జోన్ గా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినందున, ప్లాస్టిక్ వస్తువులు నిషేధమని, వన్యప్రాణులకు పండ్లు, ఇతర తిను బండారాలు వేయకూడదని,  రూల్స్ ఉల్లంఘిస్తే  రూ.10 వేల ఫైన్ విధిస్తామని హెచ్చరించారు.