చంఢీఘర్: డబ్బు, వ్యక్తిగత కారణాలు, కుటుంబ కలహాల వల్ల హత్యలు జరగడం చూశాం. కానీ తన కంటే అందంగా ఉన్నారనే ఆసూయతో అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులను నిర్దాక్షిణ్యంగా చంపేసింది ఓ మహిళా. ఆ తర్వాత తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలని చివరికి కన్న కొడుకుని కూడా అంతమొందించింది. ఈ భయంకరమైన ఘటన హర్యానా రాష్ట్రంలోని పానిపట్‌లో వెలుగు చూసింది
వివరాల ప్రకారం.. విధి అనే ఆరేళ్ల బాలిక కుటుంబ సభ్యులతో కలిసి పానిపట్‌లోని నౌల్తా గ్రామంలో జరిగిన ఒక శుభకార్యానికి వెళ్లింది. పెళ్లికి పోయిన విధి అనుమానస్పదంగా నీటి టబ్‌లో పడి మరణించింది. కూతురి మరణంపై విధి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలిక ప్రమాదవశాత్తూ నీటి టబ్‌లో పడి మరణించిందని మొదట అంతా భావించారు. కానీ పోలీసులు తమదైన శైలీలో విచారణ చేయడంతో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
విధి ప్రమాదవశాత్తూ చనిపోలేదని.. బాలికను హత్య చేసింది వరసకు అత్త అయ్యే పూనమ్ అనే మహిళా. కోడలు తన కంటే అందంగా ఉందనే అసూయతోనే పూనమ్ హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. అందరూ పెళ్లి బరాత్‌కు వెళ్లగా విధిని తీసుకెళ్లి నీటి టబ్‌లో ముంచి చంపిందని తెలిపారు. పూనమ్‌కు ఇదే మొదటి హత్య కాదు.. 2023లో తన వదిన కుమార్తెను ఇదే తీరులో టబ్‌లో ముంచి చంపేసింది. ఆ తర్వాత తన మీద అనుమానం రాకుండా ఉండేందుకు అదే ఏడాది తన కొడుకుని హతమార్చింది.
2025, ఆగస్టులో సివాహ్ గ్రామంలో మరో బాలికను తనకంటే అందంగా ఉందని కారణంతో చంపేసిందని పోలీసులు తెలిపారు. అందంగా కనిపించే బాలికలను చూసి అసూయతోనే చంపేశానని.. తనపై డౌట్ రాకుండా తన కుమారుడిని కూడా హత్య చేశానని నిందితురాలు విచారణలో ఒప్పుకుందని పోలీసులు వెల్లడించారు. నేరాలు చేసిన తర్వాత ఆ మహిళ సంబరాలు చేసుకుంటుందని తెలిపారు.
