
ప్రపంచవ్యాప్తంగా డిజిటలైజేషన్ విప్లవం వలన సెల్ ఫోన్, టెలివిజన్, కంప్యూటర్లు తదితర ఎలక్ట్రానిక్స్ వస్తువుల వినియోగం గణనీయంగా పెరిగింది. తద్వారా ఎలక్ట్రానిక్ వ్యర్థాల పరిమాణం, ఘన వ్యర్థాల పరిమాణం కూడా విపరీతంగా పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక అతి పెద్ద పర్యావరణ సమస్యగా మారిపోయింది.
వస్తువుల తయారీకోసం విలువైన సహజ సంపదలు కూడా తరిగిపోతున్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ), ఇతర నివేదికల ప్రకారం భారతదేశం సంవత్సరానికి సుమారు 62 మిలియన్ టన్నుల మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి చేస్తోంది.
గ్లోబల్ సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి సంవత్సరానికి సుమారు2.24 బిలియన్ మెట్రిక్ టన్నులుగా అంచనా. జనాభా వృద్ధి, నగరీకరణ, పెరుగుతున్న వినియోగం కారణంగా 2050 నాటికి ఇది 3.4 బిలియన్ మెట్రిక్ టన్నులకు పెరుగుతుందని అంచనాలు సూచిస్తున్నాయి.
2022లో యునైటెడ్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (యూఎన్ఐటీఏఆర్), అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) ద్వారా గ్లోబల్ ఈ-–వేస్ట్ మానిటర్ 2024 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి సుమారు 62 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థం (ఈ-–వేస్ట్) ఉత్పత్తి అయింది. 2030 నాటికి ప్రపంచ ఈ-–వేస్ట్ సంవత్సరానికి 82 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకుంటుంది అని అంచనా.ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరగడం, పరిమితమైన రీసైక్లింగ్ మౌలిక సదుపాయాల కారణంగా భారతదేశంలో వేగంగా ఈ-–వేస్ట్ పెరుగుతోంది.
ఆర్థిక సంవత్సరం 2023–-24 హౌసింగ్, అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, భారతదేశం 1.751 మిలియన్ మెట్రిక్ టన్నుల ఈ-–వేస్ట్‌ను ఉత్పత్తి చేసింది. ఈ ధోరణి కొనసాగితే 2050 నాటికి భారతదేశం ఈ-–వేస్ట్ ఉత్పత్తి 161 మిలియన్ మెట్రిక్ టన్నులకుపైగా చేరుకుంటుందని అంచనా. కొత్త వస్తువుల తయారీకి సహజ వనరుల వినియోగం వలన భవిష్యత్తులో సహజవనరుల కొరత ఏర్పడుతుంది, ఈ-–వేస్ట్, ఘనవ్యర్థాల పరిమాణం పెరుగుతుంది. వస్తువుల తయారీ ప్రక్రియలో హరిత వాయువుల విడుదల మొదలు అంశాలు పర్యావరణానికి హాని కలుగజేస్తాయి. వీటి అన్నింటికీ సర్క్యులర్ ఎకానమీ (వృత్తాకార ఆర్థిక వ్యవస్థ) సరైన పరిష్కారం.
వృత్తాకార ఆర్థిక వ్యవస్థ
తగ్గించడం, పునర్వినియోగం, రీసైకిల్ అనేవి సర్క్యులర్ ఎకానమీ ప్రధాన అంశాలు. తగ్గించడం అంటే అనవసరంగా వస్తువుల వినియోగాన్ని, కొనుగోళ్ళను తగ్గించడం. దీనివలన సహజ వనరుల వినియోగం తగ్గుతుంది. తద్వారా కొత్త ముడి పదార్థాల డిమాండ్ కూడా తగ్గుతుంది. పునర్వినియోగం అనగా వస్తువులను దాని అసలు రూపంలో మళ్ళీమళ్ళీ ఉపయోగించడం.
ఉదాహరణకు ఉతికి వేసుకునే బట్టలు. రీసైకిల్ అంటే జీవిత చక్రం ముగిసిన, వాడకానికి పనికిరాని పాత వస్తువులను ప్రాసెస్ చేసి వాటి నుంచి తిరిగి కొత్త వస్తువులను తయారుచేయటం. ఉదాహరణకు పాత, చిత్తు కాగితాల నుంచి కొత్త పేపరు తయారు చేయడం, లోహపు వస్తువులను కరిగించి తిరిగి కొత్త వస్తువులను తయారు చేయడం మొదలగునవి.
ఈ మూడు ప్రధాన అంశాలు కొత్త ముడి పదార్థాల అవసరాన్ని తగ్గించడం, వనరుల జీవితచక్రాన్ని పెంచటం, వ్యర్థాలను తగ్గించడం ద్వారా స్థిరమైన వ్యవస్థను సృష్టిస్తాయి. వృత్తాకార ఆర్థిక వ్యవస్థను ‘చక్రాన్ని మూసివేయడం’ (క్లోజింగ్ ది లూప్) అని పిలుస్తారు. ఎందుకంటే ఈ వ్యవస్థలో వనరులు/ వస్తువులు సాధ్యమైనంత ఎక్కువకాలం ఉపయోగంలో ఉంటాయి.
సర్క్యులర్ ఎకానమీ విధానాలను అమలుచేస్తున్న ఆపిల్ సంస్థ
ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆపిల్ సంస్థ 2030 సంవత్సరం నాటికి కార్బన్ న్యూట్రాలిటీ లక్ష్యాన్ని సాధించటం కోసం సర్క్యులర్ ఎకానమీ విధానాలను అమలుచేస్తున్నది. కార్బన్ న్యూట్రాలిటీ, అంటే వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, ఇతర గ్రీన్‌హౌస్ వాయువుల మొత్తాన్ని సహజ లేదా కృత్రిమ మార్గాల ద్వారా తొలగించి సమానమైన మొత్తాన్ని సమతుల్యం చేయడం.
కార్బన్ తొలగింపు ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడం, చెట్లను నాటడం వంటి వివిధ పద్ధతుల ద్వారా ద్వారా ఈ సమతుల్యతను సాధించవచ్చు. ఆపిల్ కంపెనీ తమకు చెందిన పనికిరాని/ వాడేసిన ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి బంగారం, అల్యూమినియం కోబాల్ట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటి పదార్థాలను రీసైక్లింగ్ చేయడానికి 'డైసీ రోబోట్'ను ఉపయోగిస్తుంది.
2024లో 24% రీసైకిల్ చేసిన పదార్థాలను ఉపయోగించడం, రిపేర్ ప్రోగ్రామ్‌లను అందించడం, 100% రీసైకిల్ లేదా పునర్వినియోగ వనరులను లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా ఆపిల్ కొత్త వనరులపై ఆధారపడటాన్ని, వ్యర్థాలను తగ్గించుకుంటున్నది. సర్క్యులర్ ఎకానమీ కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది, వ్యర్థాలను తగ్గిస్తుంది, సహజ వనరులను సంరక్షిస్తుంది.
ఆపిల్ రీసైక్లింగ్ ప్రయత్నాలు 2024లో 22 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ను తగ్గించింది. రీసైక్లింగ్.. రిపేర్ రంగాలలో ఉద్యోగాలను సృష్టిస్తుంది, ముడి పదార్థాల ఖర్చులను తగ్గిస్తుంది. ఈ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు, పరిశ్రమలు, ప్రజలు సర్క్యులర్ ఎకానమీ పద్ధతులను అవలంబిస్తే మంచిది.
రేఖీయ ఆర్థిక వ్యవస్థతో పర్యావరణానికి హాని
బంగారాన్ని ఒకసారి భూమి నుంచి వెలికితీసిన తరువాత తగ్గించడం, పునర్వినియోగం, రిసైకిల్ పద్ధతుల ద్వారా మళ్లీ మళ్లీ వాడటం జరుగుతోంది. అంతేకానీ పారవేయటం జరగదు. అంటే ఒకసారి భూమి నుంచి వెలికి తీసిన బంగారం ఘనవ్యర్ధాల రూపంలో ఎప్పటికీ తిరిగి భూమిలోకి చేరదు. సంప్రదాయ రేఖీయ ఆర్థిక వ్యవస్థ వృత్తాకార ఆర్థిక వ్యవస్థకు భిన్నంగా ఉంటుంది.
రేఖీయ ఆర్థికవ్యవస్థ తీసుకోవడం తయారు చేయడం పారవేయడం అనే మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. రేఖీయ ఆర్థిక వ్యవస్థ పర్యావరణానికి హానికరం అయినది. ఈ పద్ధతిలో ప్రకృతి నుంచి సేకరించిన ముడిపదార్థం నుంచి వస్తువును తయారుచేసిన తరువాత వాడుకొని వస్తువును పారవేయడం జరుగుతుంది. ఈ పద్ధతి ఘన వ్యర్థాలు, ఇతర వ్యర్థాలను అధిక ప్రమాణంలో ఏర్పరుస్తుంది. ముడిపదార్ధాలు సహజ వనరులు వృథా అవుతాయి. ఉదాహరణకు సింగల్ యూస్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, పేపర్ టీ కప్స్, ప్లాస్టిక్ కోటెడ్ పేపర్ ప్లేట్స్ మొదలగునవి.
- డా.శ్రీధరాల రాము,ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్-