ఆర్జీ కోల్ మైన్ కు పర్యావరణ శాఖ క్లియరెన్స్... షరతులతో కూడిన అనుమతులు 

ఆర్జీ కోల్ మైన్ కు పర్యావరణ శాఖ క్లియరెన్స్... షరతులతో కూడిన అనుమతులు 
  • 420.91 హెక్టార్లలో 4.67 లక్షలకు పైగా మొక్కలు పెంచాలె 
  • ఇందుకోసం రూ.163 కోట్ల బడ్జెట్ ఇవ్వాలె 
  • బొగ్గును కన్వేయర్ బెల్టులు, రైల్వే వ్యాగన్ల ద్వారానే తరలించాలె 
  • మొసళ్లు, వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక నిధులు

కరీంనగర్, వెలుగు: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రతిపాదించిన రామగుండం కోల్ మైన్ (ఆర్జీ కోల్ మైన్) ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ పర్యావరణ అనుమతులు మంజూరు చేస్తూ ఇటీవల అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న ఐదు మైన్లను (ఆర్జీ ఓసీ-1, ఆర్జీ ఓసీ-2, అండ్రియాల లాంగ్‌‌‌‌‌‌‌‌వాల్ ప్రాజెక్ట్, జీడీకే-10, వకీల్‌‌‌‌‌‌‌‌పల్లి) విలీనం చేస్తూ, వార్షిక బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని 21 మిలియన్ టన్నులకు పెంచేందుకు ఈ అనుమతులు ఇచ్చింది. 

5,400 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో రూ.2,194 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ గని జీవితకాలాన్ని 41 ఏళ్లుగా నిర్ణయించారు. పెద్దపల్లి జిల్లాలోని పన్నూర్, నాగపల్లి, లద్నాపూర్, రత్నాపూర్, బుధవారంపేట, రామయ్యపల్లి, వకీల్‌‌‌‌‌‌‌‌పల్లి, జల్లిపల్లి, ముల్కలపల్లి గ్రామాల్లోని 4,326.08 హెక్టార్ల లీజు భూభాగంలో ఈ మైనింగ్ జరగనుంది. అయితే, ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా కేంద్ర ప్రభుత్వం పలు కఠినమైన షరతులు విధించింది.

అటవీ భూముల్లో మైనింగ్‌‌‌‌‌‌‌‌పై ఆంక్షలు.. 

కాలుష్యాన్ని తగ్గించేందుకు బొగ్గును గనుల నుంచి మైన్ ఉపరితలానికి, అక్కడి నుంచి సైడింగ్‌‌‌‌‌‌‌‌లకు కేవలం కన్వేయర్ బెల్టుల ద్వారా మాత్రమే రవాణా చేయాలని నిబంధన విధించింది. సైడింగ్ నుంచి రైలు మార్గం ద్వారానే రవాణా జరగాలని, రోడ్డు ద్వారా బొగ్గు రవాణా చేయడానికి వీల్లేదని పేర్కొంది. కన్వేయర్ బెల్ట్ వెంబడి ఇరువైపులా మూడంచెల్లో వనాలను పెంచాలని ఆదేశించింది. అలాగే, ప్రాజెక్టులో భాగమైన 308.81 హెక్టార్ల అటవీ భూమికి సంబంధించి స్టేజ్-2 అటవీ అనుమతులు పొందే వరకు ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు చేపట్టకూడదని పేర్కొంది. 

సర్ఫేస్ రైట్స్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు నిర్దేశిత అటవీ ప్రాంతాల్లో పనులను నిలిపివేయాలని స్పష్టం చేసింది. పర్యావరణ పరిరక్షణ చర్యల కోసం ఈ ప్రాజెక్టులో ప్రత్యేకంగా రూ.163 కోట్ల బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను కేటాయించాల్సి ఉంటుంది. ప్రాజెక్టు మొత్తం విస్తీర్ణంలో 420.91 హెక్టార్ల పరిధిలో (9.66 శాతం) గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేయాలి. రాబోయే పదేళ్లలో 4,67,631 మొక్కలను నాటి సంరక్షించాలి.  

గనుల పరిసరాల్లో గాలి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించేందుకు కోర్ జోన్‌‌‌‌‌‌‌‌లో ఒకటి, బఫర్ జోన్‌‌‌‌‌‌‌‌లో మరొక ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయాలి. వీటిని స్టేట్ కంట్రోల్ బోర్డు సర్వర్‌‌‌‌‌‌‌‌కు అనుసంధానించాలి. గనుల నుంచి వచ్చే నీటిని శుద్ధి చేసిన తర్వాతే సమీపంలోని సాగునీటి చెరువుల్లోకి వదలాలి. మైనింగ్ ప్రారంభించే ముందే నీటి వినియోగానికి సంబంధించి సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ నుంచి సింగిల్ ఎన్‌‌‌‌‌‌‌‌వోసీ పొందాలి.

వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక బడ్జెట్.. 

ఆర్జీ కోల్ మైన్ ఏరియా శివరాం మొసళ్ల వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి 6.07 కిలోమీటర్ల సమీపంలో ఉన్నందున, మొసళ్లతోపాటు వన్యప్రాణుల రక్షణ చర్యల కోసం రూ.8.21 కోట్లను తెలంగాణ ఫారెస్ట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ సొసైటీలో జమ చేయాలి. షెడ్యూల్-1 కిందికి వచ్చే 28 రకాల వన్యప్రాణుల సంరక్షణ ప్రణాళిక కోసం ఇందులో రూ.3.35 కోట్ల బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను వినియోగించాలి.
 
బొగ్గు గనుల పూడ్చివేత

మైనింగ్ పూర్తయిన తర్వాత ఏర్పడే 'ఆర్జీ ఓసీ-2' గని ఓవర్‌‌‌‌‌‌‌‌బర్డెన్ (మట్టి) వ్యర్థాలతో తిరిగి నింపేలా మైనింగ్ ప్లాన్‌‌‌‌‌‌‌‌ను 6 నెలల్లో సవరించుకోవాలి. గనుల తవ్వకం పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆయా ప్రాంతాల్లో తిరిగి గడ్డి, మొక్కలు పెంచి పశుగ్రాసానికి అనువుగా మార్చాలని స్పష్టం చేసింది. 

ఆర్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌ ప్యాకేజీ పక్కాగా అమలు చేయాలె.. 

ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే రాజాపూర్, బుధవారంపేట (రామయ్యపల్లి హ్యామ్లెట్‌‌‌‌‌‌‌‌తో కలిపి) గ్రామాల్లోని 2,700 నిర్వాసిత కుటుంబాలకు కాలపరిమితితో కూడిన పునరావాస సౌకర్యాలు కల్పించాలి. ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన వినతుల మేరకు రూ.22 కోట్లు కేటాయించారు. 

ఈ నిధులతో స్థానిక గ్రామాల్లో స్కిల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ శిక్షణ, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలల్లో డిజిటల్ లైబ్రరీలు, పబ్లిక్ టాయిలెట్లు, హైమాస్ట్ లైట్లు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు కారణంగా ఇళ్లు కోల్పోతున్న రాజాపూర్, బుధవారంపేట గ్రామాలకు చెందిన 2,700 ప్రాజెక్టు బాధిత కుటుంబాలకు సకాలంలో పూర్తిస్థాయి పునరావాసం, పునరుపాధి కల్పించాల్సి ఉంది.