జీవుల మనుగడకు పర్యావరణ సమత్యులత ఎంతో ముఖ్యం. మనుషులు, ఇతర జీవుల జీవనానికి ఆయువుపట్టే పర్యావరణం. జీవ వైవిధ్యం కోల్పోవడం వల్ల జరిగే అనర్థాలు కళ్లారా చూస్తున్నాం. మన అవసరాలకు కావాల్సిన వస్తువుల తయారీకి చెట్లు, ఇతర జీవ, జలరాశులను పరిశ్రమల ఏర్పాటుతో చిన్నాభిన్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు సూరారం కాలనీకి చెందిన కోల రవీందర్. వృత్తిరీత్యా డాక్యుమెంట్రైటర్ అయినప్పటికీ పర్యావరణాన్ని కాపాడాలని ప్రజలకు అవగాహనం కల్పించడమే ప్రవృత్తిగా మార్చుకున్నాడు. ప్లాస్టిక్వాడకాన్ని తగ్గించాలని, ఇంటింటికీ ఇంకుడు గుంతలు ఉండాలని, స్విమ్మింగ్‌ను పాఠ్యాంశంగా చేర్చాలని.. పలు అంశాలపై వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు. బుధవారం అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషిపై కథనం.
ప్లాస్టిక్ వినియోగంపై వ్యతిరేక పోరాటం…
ఆపరేషన్ చేసి ఓ ఆవుకు కడుపులోంచి కిలోల కొద్దీప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీశారనే వార్త తనను ఎంతో కదిలించిందని, దాంతో ప్లాస్టిక్ ఎంత అనర్థమో తెలుసుకుని ప్రచారం చేస్తున్నట్టు తెలిపాడు. పోస్టర్లు ఏర్పాటు చేసి, వారాంతపు సంతల్లో తిరిగి మైకుతో ప్రచారం చేస్తున్నాడు. అందరూ నవ్వుతున్నా పట్టించుకోకుండా తన ప్రచారం కొనసాగిస్తున్నాడు. సంతల్లో జూట్‌బ్యాగులు ఉచితంగా పంపిణీ చేసి అందరినీ ఆలోచించేలా చేస్తున్నాడు. మటన్, చికెన్‌దుకాణాల వద్ద కవర్లలో మటన్ తీసుకునేవారికి ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై వివరిస్తూ స్టీల్టిఫిన్ బాక్సులు అందజేసి ప్రచారం కొనసాగిస్తున్నాడు. వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ప్లాస్టిక్‌ను చెరువులో వేయొద్దని బ్యానర్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాడు.
భూగర్భ జలాల పరిరక్షణ…
ప్లాస్టిక్పైనే కాకుండా ఇంటింటికీ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్న ప్రచారాన్ని చేపట్టాడు. తన ఇంట్లో ఇంకుడు గుంత ఏర్పాటు చేసి, తెలిసిన వారి ఇళ్లలో కూడా గుంతలు తీయించాడు. వర్షం నీరు భూమిలో ఇంకకుండా సిమెంటు రోడ్లు వేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, అందుకే నీటిని పొదుపుచేయాలని కరపత్రాలతో ప్రచారం చేస్తున్నాడు. ఈత రాక నీటిలో మునిగి ఎంతోమంది యువకులు చనిపోతున్నారని పేపర్ క్లిప్పింగులతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు. చెరువు, కుంటల్లో ఈతరాకుండా దిగొద్దని చెబుతున్నాడు. స్విమ్మింగ్‌ను పాఠ్యాంశంగా చేర్చాలని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు కోరుతూ వినతిపత్రాలు అందజేస్తున్నాడు. తన కుమారుడు శ్రీకాంత్ పెళ్లి పత్రికను కూడా పర్యావరణ పరిరక్షణ ప్రచారంలో భాగం చేశాడు. ‘వర్షం నీరే జీవనాధారం. ప్లాస్టిక్ కవర్లు వద్దు. చెట్లను పెంచి కాపాడుకొనుట మన ధర్మం. చేతిసంచులు ముద్దు. పర్యావరణాన్ని కాపాడుట మన బాధ్యత. భావితరాలకు మనమే మార్గదర్శకులవుదాం’. అని నినాదాలతో కార్డును ముద్రించాడు. పెళ్లిలో ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా అందరితో శభాష్ అనిపించుకున్నాడు.