- డిస్కంలకు ఈఆర్‌సీ షాక్
- ఓపెన్ యాక్సెస్ ఇండస్ట్రీలకు వెసులుబాటు
- అడిషనల్ సర్‌చార్జీ కిలోవాట్ అవర్‌కు రూ.9.86 పైసలకు డిస్కంల ప్రతిపాదన
- 36 పైసల వసూళ్లకే ఈఆర్‌సీ గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, వెలుగు : డిస్కంల నుంచి కాకుండా ఇతర సంస్థల నుంచి కరెంటు కొనుగోలు చేసే పారిశ్రామిక సంస్థల నుంచి అడిషనల్ సర్‌చార్జి రూపంలో భారీగా వసూలు చేయాలని భావించిన విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలు) ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్‌సీ) షాక్ ఇచ్చింది. అత్యధిక ధరతో డిస్కంలు సరఫరా చేసే కరెంటును కాకుండా బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకు కరెంటు కొనే సంస్థలు, ఇండస్ట్రీల నుంచి 2023–24లో వీలింగ్ చార్జీలు, సర్ చార్జీల పేరుతో భారీగా వసూళ్లకు డిస్కంలు ప్రతిపాదనలు చేశాయి. ఓపెన్ యాక్సెస్ నుంచి కరెంటు కొనే పారిశ్రామిక సంస్థల నుంచి అడిషనల్ చార్జీల రూపంలో కిలోవాట్ హవర్‌కు రూ.9.86 పైసల చొప్పున వసూలు చేసేందుకు డిస్కంలు ప్రతిపాదనలు చేశాయి.
దీనిపై ఇప్పటికే విచారణ జరిపిన ఈఆర్‌సీ.. 2023–24లో మొదటి ఆరు నెలలకు (ఏప్రిల్1 నుంచి సెప్టెంబరు 30 వరకు) కిలోవాట్ హవర్‌కు 39 పైసలే వసూలు చేసుకునేందుకు అనుమతిచ్చింది. డిస్కంలు నెట్ చార్జీల రూపంలో రూ.210.20 కోట్లు వసూలు చేసుకునేందుకు ఈఆర్‌సీకి ప్రతిపాదనలు చేశాయి. కానీ, రూ.8.29 కోట్లనే వసూలు చేయడానికి ఈఆర్ సీ వెసులుబాటు కల్పించింది. డిస్ట్రిబ్యూషన్ చార్జీల రూపంలో యూనిట్‌కు రూ.1.17 ప్రతిపాదించగా 20 పైసలకే ఈఆర్‌సీ అనుమతిచ్చింది. ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ చార్జీల రూపంలో ఓపెన్ యాక్సిస్ కస్టమర్ల నుంచి రూ.354.68 కోట్ల వసూలుకు అనుమతించాలని డిస్కంలు ప్రతిపాదించగా ఈఆర్‌సీ రూ.172.05 కోట్లకే అనుమతించింది. దీంతో డిస్కంల అంచనాలు తారుమారయ్యాయి. ఈఆర్‌సీ తాజా ఉత్వర్వులు ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నాయి.
