సినిమా సెట్టింగులను తలపించేలా కాళేశ్వరం ముస్తాబు.. సరస్వతీ అంత్య పుష్కరాలకు సర్వం సిద్ధం

సినిమా సెట్టింగులను తలపించేలా కాళేశ్వరం ముస్తాబు.. సరస్వతీ అంత్య పుష్కరాలకు సర్వం సిద్ధం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వర క్షేత్రం పుష్కర శోభను సంతరించుకుంటోంది.  మే 21 నుంచి జూన్ 1 వరకు త్రివేణి సంగమ తీరంలో జరగనున్న సరస్వతీ నది అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఈ అంత్య పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సుమారు రూ. 30 కోట్ల  నిధులను మంజూరు చేసి, యుద్ధ ప్రాతిపదికన పనులను నిర్వహిస్తోంది. పుష్కర ఘడియలు సమీపిస్తుండడంతో పనులు చక చక కొనసాగుతున్నాయి.

ఈసారి భక్తులను ఆకర్షించేందుకు క్షేత్రాన్ని అద్భుతంగా ముస్తాబు చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా సెట్టింగులను తలపించేలా అద్భుతమైన అలంకరణలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తుండటం విశేషం.

మరోవైపు, లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అధికారులు అన్ని వసతులను సిద్ధం చేస్తున్నారు.విశాలమైన వాహన పార్కింగ్ స్థలాలు, అవసరమైన తాగునీటి వసతులు, మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కావస్తున్నాయి.

పుష్కర సమయానికి పనులన్నీ వంద శాతం పూర్తవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో త్రివేణి సంగమ క్షేత్రం భక్తుల జనసంద్రంతో, ఆధ్యాత్మిక చైతన్యంతో పునీతం కానుంది.