ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఏర్పుల నరోత్తమ్‌

ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఏర్పుల నరోత్తమ్‌

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా ఏర్పుల నరోత్తమ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం (సెప్టెంబర్​ 8న) ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, ఏర్పుల నరోత్తమ్‌కు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తనకు చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు ఏర్పుల నరోత్తమ్ ధన్యవాదాలు తెలిపారు.

ఏర్పుల న‌రోత్తమ్ జహీరాబాద్‌లోని పస్తాపూర్‌లో 1965, ఏప్రిల్ 19న చంద్రమ్మ, న‌ర్సయ్య దంప‌తుల‌కు మూడో సంతానంగా జ‌న్మించారు. ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు జహీరాబాద్‌లోనే చదువుకున్నారు.  హైద‌రాబాద్‌లో ఇంట‌ర్ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 1987 సివిల్ ఇంజినీరింగ్ చేశారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీటి పారుద‌ల శాఖ‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఉద్యోగం సంపాదించారు. శ్రీశైలం ప్రాజెక్టు కాలువ‌ల డిజైన్లలో కీల‌క‌పాత్ర పోషించారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ప్రమోషన్ పొందారు. సింగూరు ప్రాజెక్టు గేట్ల ఇన్​ చార్జిగా వ్యవ‌హ‌రించారు. వికారాబాద్‌లో మైన‌ర్ ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌కు ఇన్ చార్జిగా వ్యవ‌హ‌రించారు.

2008లో త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి రాజ‌కీయాల్లోకి వచ్చారు. 2009, 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున జ‌హీరాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు.  2019లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023, జులై 6వ తేదీన బీఆర్ఎస్ లో చేరారు. ఏర్పుల న‌రోత్తమ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.