ఆంధ్రాలో కలిపిన ఏడు మండలాలు మళ్లీ తెలంగాణలో కలపాలె

ఆంధ్రాలో కలిపిన ఏడు మండలాలు మళ్లీ తెలంగాణలో కలపాలె

జనగామ/పాలకుర్తి, వెలుగు: కేంద్ర సర్కారు తెలంగాణపై వివక్ష మానుకోవాలని, ఆంధ్రాలో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు డిమాండ్​చేశారు. జనగామ శివారు యశ్వంతాపూర్​లోని టీఆర్ఎస్​పార్టీ జిల్లా ఆఫీస్​లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్​ ఎన్నికల్లో భాగ్మలక్ష్మీ అమ్మవారు, వరంగల్​ ఎన్నికల్లో భద్రకాళీ అమ్మవారి పేరిట రాజకీయాలు చేశారన్నారు. మునుగోడు ఎన్నికల్లోనూ యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో బండి సంజయ్​ తడిబట్ట స్నానం చేసి దేవుడినే మోసం చేయాలని చూశాడన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలనే బండి సంజయ్​ పన్నాగం విఫలమైందన్నారు.

మునుగోడులో గత ఎన్నికల్లో తమ పార్టీకి 74 వేల ఓట్లు వస్తే ఈ సారి 96 వేల ఓట్లు వచ్చాయన్నారు. మోడీ, షాల కుట్రలు తెలంగాణలో సాగవన్నారు.  మూడేండ్లుగా ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బంది పెడుతున్నారని ఈసారైనా కొనాలని అన్నారు.  తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులను కేంద్రం వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. పాలకుర్తి మండలంలోని వల్మిడి, అయ్యంగారిపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు సెంటర్లను మంత్రి ప్రారంభించారు. వల్మిడి గుట్టకు రోడ్డు నిర్మాణం కోసం రూ.2.65 కోట్లు, మంచుప్పుల, వల్మిడి గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పాలకుర్తి నుంచి కొడకండ్లకు సెంట్రల్​ లైటింగ్​ఏర్పాటు కోసం రూ.6 కోట్లు, వల్మిడి నుంచి మల్లంపల్లి రోడ్డు కోసం రూ.1.10 కోట్లు నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. వల్మిడి గ్రామంలో మంత్రి రోడ్డుపక్కన కారు ఆపి ఈత కల్లు తాగారు.