శరణ్ చౌదరి ఎవరో తెలియదు : ఎర్రబెల్లి

శరణ్ చౌదరి ఎవరో తెలియదు : ఎర్రబెల్లి
  • ఎన్ఆర్ఐ విజయ్​తో ఎలాంటి బంధుత్వం లేదు: ఎర్రబెల్లి 
  • ఫోన్ ట్యాపింగ్ కేసుతో సంబంధం లేదు
  • పార్టీ మారాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణ 

హైదరాబాద్, వెలుగు: వడ్డేపల్లి శరణ్ చౌదరి అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. శరణ్ చౌదరిని బెదిరించి ఆయన ఇంటిని తన బంధువు పేరు మీదకు బలవంతంగా మార్చుకున్నానంటూ తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తమని చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్‌‌‌‌లో మీడియాతో ఎర్రబెల్లి మాట్లాడారు. ‘‘శరణ్ చౌదరి, ఎన్ఆర్ఐ విజయ్ వ్యాపార లావాదేవీలతో నాకెలాంటి సంబంధం లేదు. నేను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఒక మిత్రుడి ద్వారా విజయ్ నన్ను కలిశారు. తనను శరణ్ చౌదరి మోసం చేశాడని, న్యాయం చేయాలని విజయ్ అడిగారు. నేను మాట సాయంగా పోలీసులతో మాట్లాడించాను తప్ప.. విజయ్‌‌తో ఎలాంటి బంధుత్వం లేదు.

ఎన్ఆర్ఐలను లక్ష్యంగా చేసుకుని శరణ్ చౌదరి మోసాలకు పాల్పడుతుంటాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని చాలామంది ఎన్ఐఆర్‌‌ల వద్ద రూ.కోట్లు లూటీ చేశాడు. శరణ్ పేరు మీద ఎన్నో కేసులు ఉన్నాయి. అతనిపై ఇంటర్నేషనల్ లుక్ అవుట్ నోటీస్ కూడా ఉంది” అని తెలిపారు. ‘‘ఫోన్ ట్యాపింగ్‌‌ కేసుతోనూ నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావుతో ఎలాంటి బంధుత్వం, పరిచయం కూడా లేదు. రాజకీయంగా లబ్ధి పొందేందుకే నాపై తప్పులు ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ మారాలని నన్ను ఒత్తిడి చేస్తున్నారు” అని ఆరోపించారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.