
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలపై కోర్టులు జోక్యం చేసుకోలేవని హైకోర్టు డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది. కొత్త అసెంబ్లీ నిర్మాణం కోసం ఎర్రమంజిల్ బిల్డింగ్‌ను కూల్చివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శంకర్, సాబ్నా సరస్వత్, ప్రొఫెసర్ విశ్వేశ్వర్‌రావు, తదితరులు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలపై హైకోర్టులో రెండోరోజు కూడా వాదనలు కొనసాగాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఎదుట పిటిషనర్ల తరపున లాయర్ రచనారెడ్డి తన వాదనలు వినిపించారు. నిజాం నవాబులు నిర్మించిన ఎర్రమంజిల్ బిల్డింగ్‌ను గతంలోనే హుడా హెరిటేజ్ లిస్ట్‌లో చేర్చిందన్నారు. ఎర్రగడ్డలోని బిల్డింగ్ స్థానంలో సెక్రటేరియెట్ కట్టాలని చేసిన ప్రయత్నాలకు 2015లో హైకోర్టు స్టేతో బ్రేక్ పడిందనీ, దీంతో ప్రభుత్వం వెంటనే ఎర్రమంజిల్ బిల్డింగ్‌పై కన్నేసిందని చెప్పారు. ఎర్రగడ్డ బిల్డింగ్ కేసులో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం అదే ఏడాది ఎర్రమంజిల్ బిల్డింగ్‌ను హెరిటేజ్ లిస్ట్ నుంచి తొలగించిందని రచనారెడ్డి పేర్కొన్నారు.
ఎర్రమంజిల్ బిల్డింగ్నిర్మాత ముల్క్ వారసులు ముజఫర్ హుస్సేన్, తదితరులు వేసిన వ్యాజ్యంలో కౌంటర్ వేసేందుకు నెల రోజుల గడువు కావాలని ప్రభుత్వం కోరితే అందుకు బెంచ్ నిరాకరించింది. ఇదే తరహా కేసుల్లో కౌంటర్ వేసిన ప్రభుత్వం వారసుల కేసులో మాత్రం ఎందుకు గడువు కోరుతోందని బెంచ్ ప్రశ్నించింది. దీంతో 15వ తేదీన కౌంటర్ వేస్తామని ప్రభుత్వ అదనపు అడ్వకేట్‌జనరల్ రామచంద్రరావు చెప్పారు. ఎర్రమంజిల్ బిల్డింగ్ వద్ద భూమిపై సివిల్ కేసులు ఉండగా ప్రభుత్వం అక్కడ అసెంబ్లీ కాంప్లెక్స్‌ను ఎలా కడుతుందని నవాబు వారసులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై 15న వాదనలు జరిగే అవకాశముంది. ఇతర పిల్స్‌పై శుక్రవారం వాదనలు కొనసాగుతాయి.