పంచాయతీ ఓటర్లకూ..  బల్దియాలోనూ ఓటు హక్కు 

పంచాయతీ ఓటర్లకూ..  బల్దియాలోనూ ఓటు హక్కు 
  • ఆ జీపీలు పూర్తిగా జగిత్యాల మున్సిపాలిటీలో విలీనం చేయలే
  • అధికారుల తప్పిదం, రాజకీయ ఒత్తిళ్ల వల్లే సమస్య ఉత్పన్నం
  • ధరూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ ఓటూ మున్సిపాలిటీలోనే.. 
  • ఇటీవల జీపీ ఎన్నికల్లో ఓటేసిన వారి జాబితాపై అధికారుల కసరత్తు

జగిత్యాల, వెలుగు: జగిత్యాల మున్సిపాలిటీ ముసాయిదా ఓటర్ల జాబితాలో వింతలు చోటుచేసుకున్నాయి. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శివారు గ్రామాల ప్రజలకు జగిత్యాల మున్సిపాలిటీ ముసాయిదా ఓటర్ల జాబితాలోనూ ఓట్లు వచ్చాయి. పట్టణ విస్తరణ క్రమంలో శివారు గ్రామాలను విలీనం చేసే క్రమంలో అధికారుల తప్పిదం వల్లే ఈ సమస్యకు కారణంగా తెలుస్తోంది. మున్సిపాలిటీ విస్తరణలో ఆయా గ్రామాల సర్వే నంబర్లకే ప్రాధాన్యమివ్వగా.. ప్రస్తుత మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ముసాయిదాలో ఆయా గ్రామాల్లో గెలిచిన సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు, ఓటేసిన గ్రామస్తులు ఒక్కసారిగా పట్టణ ఓటర్లుగా మారారు. కాగా తీవ్ర గందరగోళానికి కారణమైన ఈ ఓట్లపై ఏం చేయాలనేదానిపై అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. 

విలీనం కాని జీపీలతోనే అసలు సమస్య

జగిత్యాల మున్సిపాలిటీలో ప్రస్తుతం 96 వేలకు పైగా ఓట్లు ఉన్నాయి. సాధారణంగా మున్సిపాలిటీ విస్తరణలో గ్రామ పంచాయతీలను పూర్తిగా విలీనం చేయాలి. కానీ జగిత్యాల మండలం ధరూర్, మోతె, తిప్పన్నపేట పంచాయతీల్లోని కొన్ని సర్వే నంబర్లను మాత్రమే విలీనం చేశారు. దీంతో గ్రామ పరిధిలో ఉండాల్సిన ఓట్లు పట్టణ జాబితాలోని 1, 5, 9, 12, 15 వార్డుల్లోకి చేరాయి. వివిధ గ్రామాలకు చెందిన 1,600కి పైగా ఓట్లు పట్టణ ఓటరు జాబితాలో నమోదయ్యాయి.

అంతేకాకుండా దాదాపు 5 వేలకుపైగా ఓట్లు సంబంధం లేని వార్డుల్లో నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఈ అంశంపై ఇటీవల జరిగిన చర్చలు, ఆల్ పార్టీ సమావేశాల్లో 120కి పైగా అభ్యంతరాలు రావడంతో అధికారులు ఓటరు జాబితాపై పునఃపరిశీలన చేపట్టారు. తప్పుగా మున్సిపాలిటీలో చేరిన ఓట్ల వల్ల ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడే అవకాశముందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మున్సిపాలిటిలో ధరూర్ సర్పంచ్, గ్రామస్తుల ఓట్లు

జగిత్యాల మున్సిపాలిటీలో ధరూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ ప్రవీణ్‌‌‌‌‌‌‌‌తో పాటు గ్రామస్తుల 1,600 ఓట్లు తప్పుగా చేరినట్లు అభ్యంతరాలు వచ్చాయి. ముఖ్యంగా 9వ వార్డులో నమోదైన 1,690 ఓట్లలో 720 ఓట్లు ధరూర్ గ్రామానికి చెందినవేనని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఓట్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. మల్యాల మండలం నూకపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన 4 వేల డబుల్ బెడ్‌‌‌‌‌‌‌‌రూం ఇండ్లలో 3,400 కుటుంబాలు నివసిస్తున్నాయి.

ఒక్కో కుటుంబానికి సగటున రెండు ఓట్లు చొప్పున దాదాపు 7 వేల ఓట్లు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని సమీప 11వ వార్డులో విలీనం చేసినప్పటికీ, ఓట్లను మాత్రం అక్కడికి షిఫ్ట్ చేయలేదు. ఇల్లు ఒకచోట, ఓటు మరోచోట ఉండటంతో లబ్ధిదారులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.