తప్పులతడకగా ఓటర్ లిస్టు.. ఒకే వ్యక్తికి మూడు ఓట్లు, మృతిచెందిన వారూ ఓటర్లే

తప్పులతడకగా  ఓటర్ లిస్టు.. ఒకే వ్యక్తికి మూడు ఓట్లు, మృతిచెందిన వారూ ఓటర్లే
  • ఒకే వ్యక్తికి మూడు ఓట్లు, మృతిచెందిన వారూ ఓటర్లే
  • ఒక గ్రామంలో ఓటర్ మరో గ్రామానికి షిఫ్ట్​
  • ఫొటోలూ గందరగోళమే

నిజామాబాద్​, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల కోసం జిల్లా అధికారులు ఈ నెల 10న విడుదల చేసిన ఫైనల్​ ఓటర్​ లిస్ట్​ తప్పులతడకగా ఉంది. సవరణ కోసం ఎన్నికల కమిషన్ మూడుసార్లు అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు.  ప్రతి గ్రామంలో బూత్​ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్​వోలు) ఉన్నా ఓటరు జాబితాలో తప్పులు ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్​

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఫైనల్​ఓటరు జాబితా తయారీలో అధికారులు కలెక్టర్​ ఆదేశాలను బేఖాతర్​ చేశారు.  జిల్లాలో 31 జడ్పీటీసీలు, 307 ఎంపీటీసీలు, 545 గ్రామ పంచాయతీలు, 5,022 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. ఇందుకుగాను 1,563 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళా ఓటర్లు 4,54,613, పురుషులు3,97,140, ఇతరులు 17 మంది కలిపి 8,51,770 ఓట్లు ఉన్నట్లు ఫిబ్రవరిలోనే అధికారికంగా ప్రకటించారు. 

బీసీ రిజర్వేషన్​ కోసం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్​ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇందులో భాగంగా కలెక్టర్ ఆదేశాలతో ఆగస్టు28న ముసాయిదా ఓటర్​ లిస్టును ప్రకటించారు.

 ఎన్నికలు నిర్వహించే స్థానాలు, పోలింగ్ సెంటర్లపై అభ్యంతరాలు ఉంటే తెలుపాలని మూడు రోజులు గడువు ఇచ్చారు. సెప్టెంబర్ 2న మరోసారి లిస్టు ప్రకటించి సవరణకు మరో అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 10న ప్రకటించే ఫైనల్​ ఓటరు లిస్టు తర్వాత మార్పు చేర్పులకు అవకాశం లేదు. గ్రామ, మండలం, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల నేతలతో తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహించగా, పెద్దగా అభ్యంతరాలు రాలేదు. బీఎల్​వోలు, పంచాయతీ సెక్రటరీలు, ఎంపీవోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు పూర్తిస్థాయిలో సర్వే చేయకపోవడం విశేషం. ఎలాంటి లోపాలు లేకుండా ఓటరు లిస్టును రూపొందించాలని కలెక్టర్​ ఆదేశించినా బాధ్యతను విస్మరించడం చర్చనీయాంశమైంది. 

మచ్చుకు కొన్ని..

ఎడపల్లి మండలం జాన్కంపేటలో షేక్​ షోయబ్ ఓటు మూడు చోట్ల ఉంది. సీరియల్ నంబర్​ 4195, 4196, 4426లో ఓటు నమోదైంది. కోల మంజుల, బాషునాయక్​తో పాటు మృతి చెందిన 10 మంది పేర్లను తొలగించలేదు. బోధన్​కు చెందిన నోముల కిరణ్​ ఓటును ఎడపల్లి మండలం ఎంఎస్​సీ ఫారం లిస్టులో పెట్టారు. బోధన్​ మండలం సంగెం గ్రామంలో కొల్లూరి గంగమ్మ, న్యాయకం సాయన్న, చిన్న పోశన్న, నాయకం సాయిలు మృతి చెందగా, వారిని ఓటర్లుగా నమోదు చేశారు. 

కుమ్మన్​పల్లిలో ఓటర్​ ఫొటోలు తప్పుగా ప్రింట్ అయ్యాయి. మచ్చుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఏ గ్రామంలో ఓటరు లిస్టును పరిశీలించినా తప్పులు కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం మృతి చెందినవారి ఓట్లను తొలగించాల్సి ఉంది.  ఒకరికి ఒకే చోట ఓటర్​ నమోదు చేయాల్సి ఉండగా పలుచోట్ల నమోదు కావడం,  ఓటర్​ ఫొటోలు క్లియర్​గా లేకపోవడం వంటి సమస్యలు ఓటర్లను ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది.