
ESI మందుల కొనుగోళ్ల అక్రమాల కేసులో విచారణ ముమ్మరం చేశారు ఏసీబీ అధికారులు. ESI డైరెక్టర్ దేవికా రాణిని అరెస్ట్ చేశారు. దేవికా రాణి ఇంట్లో గురువారం సోదాలు నిర్వహించిన అధికారులు.. శుక్రవారం ఉదయం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. షేక్ పేట్ లోని ఆమె నివాసం నుంచి నాంపల్లి ACB కార్యాలయానికి దేవికారాణిని తరలించారు. జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత ఇందిర, ఫార్మసిస్ట్ రాధిక, ఓమ్ని మెడి సంస్ఠకు చెందిన నాగరాజు, శ్రీహరి, IMS సీనియర్ అసిస్టెంట్ హర్షవర్ధన్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 11 మందిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్ తో పాటు వరంగల్ లోనూ గురువారం ACB రైడ్స్ జరిగాయి. ఏకకాలంలో 23 చోట్ల అధికారులు సోదాలు చేశారు. ఈ కేసులో 17 మంది ఉద్యోగులు, నలుగురు ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.10 కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగినట్లు అంచనా వేస్తోంది. నకిలీ బిల్లులు సృష్టించి, అవసరం లేకున్నా మందులు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. సోదాల్లో కొన్ని కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.