
- కొత్త ప్లాంట్‌ఏర్పాటుకు సింగరేణి బోర్డు ఒకే
మందమర్రి, వెలుగు: సింగరేణిలో పేలుడు పదార్థాల కొరత త్వరలో తీరనుంది. ఇప్పటికే రెండుచోట్ల సొంతంగా ఎక్స్‌ప్లోజివ్స్ తయారు చేస్తుండగా మరో ప్లాంట్‌ఏర్పాటుకు సింగరేణి బోర్డు శుక్రవారం ఆమోదముద్ర వేసింది. ఏటా 50 వేల టన్నుల కెపాసిటీ గల ప్లాంట్‌ను మందమర్రి ఏరియాలో నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ప్లాంట్ అందుబాటులోకి వస్తే బెల్లంపల్లి రీజియన్పరిధిలోని మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాల్లోని బొగ్గు గనులకు సకాలంలో పేలుడు పదార్థాలు అందనున్నాయి.
గనుల్లో ఎక్స్ప్లోజివ్స్వినియోగం ఇలా..
సింగరేణి సంస్థ అండర్గ్రౌండ్మైన్స్లో బొగ్గు వెలికితీసేందుకు, ఓసీపీల్లో మట్టి(ఓవర్‌బర్డెన్), బొగ్గును వెలికితీసేందుకు ఎక్స్‌ప్లోజివ్స్‌పై ఆధారపడుతోంది. సింగరేణి వ్యాప్తంగా 23 అండర్‌గ్రౌండ్ మైన్స్, 19 ఓసీపీలలో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఇందుకు ఏటా సుమారు 3 లక్షల టన్నుల పేలుడు పదార్థాలు అవసరమవుతాయి. ఓసీపీల్లో ఎస్ఎంఈ(సైట్ మిక్స్డ్ ఎమల్షన్), లార్జ్క్యాట్రిడ్జ్ ఎక్స్‌ప్లోజివ్స్, అండర్ గ్రౌండ్ మైన్స్‌లో పర్మిటెడ్ఎక్స్ప్లోజివ్స్(పీ5) వినియోగిస్తున్నారు. 3 లక్షల టన్నుల్లో 2.50 లక్షల టన్నుల ఎస్ఎంఈ మహారాష్ట్రలోని రాజురాతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 8 ప్రైవేటు కంపెనీల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఎక్స్‌ప్లోజివ్స్ తయారీకి అవసరమైన ముడిసరుకును రాష్ట్రీయ కెమికల్స్‌అండ్ ఫర్టిలైజర్స్(ఆర్‌సీఎఫ్), దీపక్ ఫర్టిలైజర్స్ నుంచి కొనుగోలు చేస్తోంది. సొంతగా సింగరేణి సంస్థ రామగుండం-3, మణుగూరు ఏరియాల్లో నడుపుతున్న ప్లాంట్ల నుంచి ఏటా 50 వేల టన్నుల ఎస్ఎంఈ ఉత్పత్తి జరుగుతోంది. సింగరేణి వ్యాప్తంగా రోజుకు సగటున 500 టన్నుల ఎక్స్‌ప్లోజివ్స్ తో 15 నుంచి 18 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్‌బర్డెన్ వెలికితీస్తున్నారు. ప్రతి గనికి రోజూ 30 నుంచి 40 టన్నుల పేలుడు పదార్థాలు అవసరం.
రెండు సొంత ప్లాంట్లు..
సింగరేణి గతంలో మహారాష్ట్రలోని నాసిక్ నుంచి పేలుడు పదార్థాలను దిగుమతి చేసుకునేది. అక్కడి కేంద్రంలో భారీ ప్రమాదం జరిగి 23 మంది మృతిచెందారు. దీంతో కొద్ది రోజులవరకు రవాణా నిలిచిపోయింది. 2018 నుంచి సొంతంగా రామగుండం 3, మణుగూరులో 50 వేల టన్నుల కెపాసిటీ గల సైట్ మిక్సింగ్ఎమల్సన్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంది. ఆర్జీ 3 ప్లాంట్‌నుంచి రామగుండం, బెల్లంపల్లి రీజియన్ల గనులు, మణుగురు ప్లాంట్‌నుంచి కొత్తగూడెం రీజియన్ మైన్స్‌కు పేలుడు పదార్థాల సప్లయ్జరుగుతోంది. సమ్మర్లో ఇతర ప్రాంతాల నుంచి ఎక్స్‌ప్లోజివ్స్ సప్లయ్‌లో కొరత ఉంటోంది. కరోనా టైమ్‌లో సప్లయ్ పూర్తిగా నిలిచింది. మరోవైపు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో అమ్మోనియం నైట్రేట్ ధర పెరగడం, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల దిగుమతికి విఘాతం వంటి కారణాలు ఎక్స్‌ప్లోజివ్స్ తయారీపై ఎఫెక్ట్ చూపడంతో గత ఏడాది బొగ్గు టార్గెట్ చేరుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కొత్త ప్లాంట్‌ఏర్పాటుకు సింగరేణి నిర్ణయం తీసుకుంది.
బెల్లంపల్లి రీజియన్ గనులకు అనుకూలం
మందమర్రి ఏరియాలో కొత్తగా 50 వేల టన్నుల కెపాసిటీ ఎస్ఎంఈ ప్లాంట్లును ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌తో కలిసి సింగరేణి ఏర్పాటు చేయనుంది. ప్లాంటు అందుబాటులోకి వస్తే బెల్లంపల్లి రీజియన్‌లోని మందమర్రిలో 2, శ్రీరాంపూర్‌లో 2, బెల్లంపల్లి ఏరియాలో ఒక ఓసీపీతో పాటు భవిష్యత్తులో వచ్చే మరో రెండు ఓసీపీలకు ఎక్స్ప్లోజివ్స్సకాలంలో అందుతాయి. ప్రస్తుతం రామగుండం 3 ప్లాంట్‌తో పాటు మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్లాంట్‌ను రామకృష్ణాపూర్సింగరేణి రెస్క్యూ స్టేషన్, మూసివేసిన కోల్వాసరీ మధ్య, కాళీనగర్(పాకిస్తాన్క్యాంప్) ఎదుట గల స్థలాల్లో ఒకచోట ఏర్పాటు చేయనున్నారు. ఏడాదిలోపు నిర్మాణ పనులు పూర్తి చేయనున్నారు.