
ప్రజాసంఘాలు, సీపీఐ, సీపీఎం నాయకులను ముందు పెట్టి ప్రధాని సభను అడ్డుకోవాలని కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో ఉన్న చైతన్యాన్ని కేసీఆర్ నాశనం చేశారని ఆరోపించారు. సీపీఐ, సీపీఎం నాయకులు ముఖ్యమంత్రి మాయమాటలు నమ్మొద్దని సూచించారు. కేసీఆర్ అందితే కాళ్ళు పడతాడు.. లేకుంటే జుట్టు పట్టుకుంటాడని చెప్పారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తేందుకు ప్రతిపక్షాలు లేకుండా చేశారని మండిపడ్డారు.
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న టీఆర్ఎస్ తో కలిసి నడిస్తే సీపీఐ, సీపీఎం పార్టీలను ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వస్తుందని ఈటల రాజేదర్ అన్నారు. సకాలం లో రైతులకు ఎరువులు అందించాలనే ఉద్దేశ్యంతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేసేందుకు ప్రధాని వస్తున్నారని చెప్పారు. చేసిన తప్పుల వల్లనే ప్రధాని ముందుకు సీఎం కేసీఆర్ రావట్లేదని విమర్శించారు.