దమ్ముంటే సిద్దిపేటలో దళితబంధు పెట్టియ్

దమ్ముంటే సిద్దిపేటలో దళితబంధు పెట్టియ్
  • మంత్రి హరీశ్‌‌కు బీజేపీ నేత ఈటల సవాల్
  • నా కొట్లాట బానిసల మీద కాదు.. కేసీఆర్ మీదే..
  • ఎవరెన్ని పొర్లు దండాలు పెట్టినా గెలిచేది బీజేపీయేనని కామెంట్

జమ్మికుంట/వీణవంక, వెలుగు: దమ్ముంటే దళిత బంధు పథకాన్ని మంత్రి హరీశ్ రావు తన సిద్దిపేట నియోజకవర్గంలో అమలు చేయాలని బీజేపీ నేత ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. ‘దళితబంధు నిజమే అయితే హరీశ్ సొంత నియోజకవర్గంలో ఎందుకు అమలు చేయడం లేదు? ఇక్కడ తిరుగుతున్న నర్సంపేట, పరకాల, పెద్దపల్లి ఎమ్మెల్యేలు వారి నియోజక వర్గాల్లో ఎందుకు అమలు చేయడం లేదో నిలదీయాలి..’ అని ప్రజలకు ఈటల పిలుపునిచ్చారు. శనివారం జమ్మికుంట మండలం మడిపల్లి, వీణవంక మండల మల్లన్నపల్లిలో పర్యటించి ఆయన మాట్లాడారు. ‘హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నిక ధర్మానికి, టీఆర్ఎస్ ప్రభుత్వ అధర్మానికి జరుగుతున్న పోరు.. నా కొట్లాట బానిసల మీద కాదు.. నా కొట్లాట కేసీఆర్ మీదే.. నియోజకవర్గంలో 18 ఏండ్లుగా ఏ పని చేయకపోతే ఇక్కడి ప్రజలు నన్ను ఎలా గెలిపిస్తారు. నన్ను చేతకాని వాడంటారా.. నా జోలికి వస్తే ఖబడ్దార్.. సముద్రం ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది.. తుఫాన్​ వస్తే అప్పుడు ప్రళయాన్నే చూపిస్తుంది. కౌశిక్​రెడ్డి నా మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు.. నీకు ఈ ఈటల రాజీనామా వల్లే ప్రగతిభవన్​లోకి ఎంట్రీ దొరికింది. పదవి రాబోతుంది. కొంచెంగా హుందాగా ప్రవర్తించు. ఇక్కడ దౌర్జన్యాలు జరిగితే ముందుగా చిందాల్సింది నా రక్తపు బొట్టే.. కేసులు పెడితే, జైల్లో పెడితే ముందు నన్నుపెట్టండి..’ అని ఈటల​ అన్నారు.

ఇదంతా అక్రమ సొమ్ము కాదా?

హుజూరాబాద్‌‌లో జరుగుతున్న మిడుతల దండు దాడిపై రాష్ర్ట ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని ఈటల చెప్పారు. ‘రెండు గుంటల ఆస్తి కలిగిన అభ్యర్థి 2 నెలల్లో 250 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెడుతున్నాడు.. ఇదంతా మీ అక్రమ సొమ్ము కాదా.. తెలంగాణ ప్రజల డబ్బుకి నువ్వు ఓనర్ కాదు. కేవలం కాపాలాదారుడివి మాత్రమే.. ఇది నీ అబ్బ జాగీర్ కాదు.?’ అని కేసీఆర్‌‌‌‌పై ఈటల నిప్పులు చెరిగారు. ‘నా మీద నిందను మోపి వెళ్లగొట్టారు. దమ్ముంటే ఉప ఎన్నికల్లో నా మీద పోటీ చేయి..’ అని కేసీఆర్‌‌‌‌కు సవాల్ విసిరారు. ఎవరెన్ని పొర్లు దండాలు పెట్టినా రేపటి ఉపఎన్నికల్లో గెలిచేది బీజేపీయేనని ఈటల ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు పాల్గొనగా పలువురు టీఆర్ఎస్ నాయకులు ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు.