నా క్యారెక్టర్ ను దెబ్బ తీసే కుట్ర

నా క్యారెక్టర్ ను దెబ్బ తీసే కుట్ర
  • పక్కా ప్లాన్ ప్రకారమే ఆరోపణలు: ఈటల
  • చిల్లర మల్లర ఆరోపణలకు లొంగను
  • ఉద్యమ సమయంలో లక్షలు ఖర్చు పెట్టిన
  • సర్కారు నుంచి ఐదు పైసలు కూడా తీస్కోలే
  • దొరలకు వ్యతిరేకంగా కొట్లాడినోడిని
  • నన్ను బీసీ దొర అని బద్నాం చేస్తున్నరు
  • ఆత్మ గౌరవం కంటే మంత్రి పదవి గొప్ప కాదు
  • రాష్ట్రంలో ఎవరు కబ్జాలకు పాల్పడ్డారో ఎంక్వైరీ చేయాలె

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై దేశంలో ఎన్ని సంస్థలు ఉన్నాయో అన్నింటితో ఎంక్వైరీ చేయించాలని హెల్త్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌ ఈటల రాజేందర్‌‌‌‌ డిమాండ్ చేశారు. తన క్యారెక్టర్‌‌‌‌ను దెబ్బతీసేందుకే కుట్రపన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాల భూములు అమ్మారో తెలియాలని.. ఎవరు కబ్జాలకు పాల్పడ్డారో ఎంక్వైరీ చేయాలని అన్నారు. సిట్టింగ్‌‌‌‌ జడ్జితో విచారణ జరిపించి.. నిజాలు నిగ్గు తేల్చాలని.. తన తప్పు ఉన్నట్లు తేలితే ముక్కు నేలకు రాస్తానని స్పష్టం చేశారు. మెదక్ జిల్లా మాసాయిపేటలో అసైన్డ్‌‌‌‌ భూముల విషయంలో వచ్చిన ఆరోపణలపై శుక్రవారం శామీర్‌‌‌‌పేట్‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఈటల రాజేందర్‌‌‌‌ నిప్పులాంటోడు. ఎవరి దగ్గర ఒక్క ఇంచు భూమి కూడా వాడుకోలేదు. నేను ఎవరికీ లొంగిపోను. ఆత్మగౌరవం కంటే పదవి గొప్పది కాదు’’ అని అన్నారు.

చిల్లరమల్లర ఆరోపణలకు లొంగిపోను

‘‘సోషల్‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌ హాస్టల్​లో చదువుకున్నోడు కోట్లు ఎట్ల సంపాదించాడని అంటున్నారు. స్కూటర్లపై వచ్చినోళ్లు 100 కోట్లు ఎట్ల సంపాదించారు? నామొత్తం ఆస్తులపై విచారణ చేయమని డిమాండ్‌‌‌‌ చేస్తున్న. నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం. సిట్టింగ్‌‌‌‌ జడ్జితో కమిటీ వేయాలి” అని ఈటల డిమాండ్ చేశారు. ‘‘నేను ఐదు పైసల బిల్ల కూడా ప్రభుత్వం నుంచి తీసుకోలేదు. రూ.100 కోట్ల లోన్‌‌‌‌ తీసుకునే స్థాయికి ఎదిగానంటే నా ప్రొఫైల్‌‌‌‌, నా కమిట్‌‌‌‌ మెంట్‌‌‌‌ ఎంతలా ఉంటుందో ఆలోచించండి. ఇలాంటి చిల్లరమల్లర ఆరోపణలకు ఈటల రాజేందర్‌‌‌‌ అనేటోడు లొంగిపోడు’’ అని చెప్పారు. ఎప్పుడైనా ప్రశ్నించే దగ్గర ఉన్నామని, లొంగిపోయే దగ్గర లేమని స్పష్టం చేశారు. ‘‘ఆస్తులు, అంతస్తుల కోసం లొంగిపోను. ఈ పదవిని గడ్డిపోచతో సమానం అనను. ఇది గౌరవప్రదమైన పదవి. కానీ ఆత్మగౌరవం కంటే ఈ పదవి గొప్పది కాదు” అని అన్నారు. 20 ఏళ్లలో ఏనాడు కూడా ఒకరి ఆస్తి కబ్జా పెట్టాలనే ప్రయత్నం చేయలేదని, ఒకరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదన్నారు. ఎర్ర చీమకు కూడా అన్యాయం చేయకుండా బతికినోళ్లమని, గడ్డిపోచని గౌరవించేటోళ్లమని చెప్పారు. 6 సార్లు ఎమ్మెల్యేగా ఉత్తగనే గెలుస్తనా అని ప్రశ్నించారు. ‘‘నా నియోజకవర్గంలో ఎవరి దగ్గరైనా అన్యాయంగా 10 వేలు తీసుకున్నట్లు, ఇబ్బంది పెట్టినట్లు, వేధించినట్లు ప్రూవ్‌‌‌‌ చేయండి.. సన్యాసం తీసుకుంటా” అని అని సవాల్‌‌‌‌ విసిరారు.

ఇంచు భూమి కూడా వాడుకోలే

‘‘కెనరా బ్యాంక్‌‌‌‌ ద్వారా 100 కోట్ల లోన్‌‌‌‌ తీసుకుని హ్యాచరీ ఎస్టాబ్లిష్‌‌‌‌ చేశాం. ఇంకా కడుతూనే ఉన్నాం. ఇది మరింత విస్తరించాలని భావించాం. ఆ చుట్టు పక్కల మొత్తం అసైన్డ్‌‌‌‌ భూములు ఉన్నాయి. నేను విస్తరించాలనుకుంటున్నానని సీఎంవో ఆఫీసర్‌‌‌‌ నర్సింగరావుకు తెలిపాను. దీన్ని అక్వైర్‌‌‌‌ చేసి ఇవ్వమన్నాను. అది వ్యవసాయ యోగ్యమైన భూమికాదు. 1994లో ఇస్తే ఇప్పటికీ ఒక్క ఎకరాన్ని కూడాఎక్కడా సాగుచేయలేదు. గవర్నమెంట్‌‌‌‌ అక్వైర్‌‌‌‌ చేసి ఇస్తే లేట్‌‌‌‌ అవుతుందని, ఒకవేళ వారంతట వారే సమ్మతించి భూమి సరెండ్‌‌‌‌ చేస్తే, టీఐసీసీ ద్వారా ఇవ్వడానికి ఈజీ అవుతుందని చెప్పారు. ఎమ్మార్వోకు సరెండ్ చేశారు. ఇప్పటికీ ఆ భూముల కాగితాలన్నీ ఎమ్మార్వో దగ్గరే ఉన్నాయి. ఇంచు భూమి కూడా వాడుకోలేదు. ఎమ్మార్వో ఆఫీసులో ఉత్తరం కూడా ఉంటుంది’’ అని ఈటల వివరించారు.

దొరకు వ్యతిరేకంగా కొట్లాడినోన్ని..

‘‘ఈ రోజు నా కులాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. నేను ముదిరాజ్‌‌‌‌ బిడ్డను. నాది భయపడే జాతికాదు, ధైర్యంతో ముందుకు పోయే జాతి. చావనన్న చస్తడు గానీ లొంగిపోయే జాతి కాదు. నా భార్య రెడ్డి. నా కొడుకు పేరు తర్వాత రెడ్డి అని.. నా భార్య యాడ్‌‌‌‌ చేశారు. దాన్ని కూడా ఇష్యూ చేశారు. నేను బీసీ కాదని, బీసీ దొర అని ప్రచారం చేస్తున్నారు. దొరకు వ్యతిరేకంగా కొట్లాడినోన్ని. అణచివేతలు, దొరతనాలు, దుర్మార్గాలపై కొట్లాడినోన్ని. అసైన్డ్‌‌‌‌ భూములపై సీఎంవో ఆఫీసులో పెద్ద అయిన నర్సింగరావును అడగండి. నయీం లాంటోడే రెక్కీ నిర్వహిస్తే భయపడలేదు. ‘పోరా పో కొడకా’ అన్న. ముందు ఈ విచారణ తేలాలి. ఎన్ని సంస్థలు ఉంటే.. అన్ని సంస్థలతో విచారణ చేయించండి. నిజాలు తేల్చండి’’ అని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

ఆత్మాభిమానాన్ని అమ్ముకోను

‘‘నేనే గుమాస్తాను. నేను జీతాన్ని. నేనే ఓనర్‌‌‌‌ని.. ఇన్ని ఆస్తులు ఎలా పెరిగాయని నన్ను ప్రశ్నిస్తున్నారు. ఒకటే జనరేషన్​లో వందల కోట్లకు ఎదిగిన అధిపతులు ఉన్నారు. వారినే అడగాలి. ఇప్పుడున్న గ్రామంలో నా భూమి నుంచి రింగ్‌‌‌‌ రోడ్డు పోయింది. నాటి సీఎం రాజశేఖర్‌‌‌‌ రెడ్డి అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌ మార్చి రింగ్‌‌‌‌ రోడ్డు వేశారు. అలైన్‌‌‌‌మెంట్‌‌‌‌ తప్పు అని కొట్లాడిన. ఈటల రాజేందర్‌‌‌‌ అనేటోడికి భూమిని కోల్పోయినా ఫర్వాలేదు. ఆత్మాభిమానాన్ని మాత్రం అమ్ముకోడు. నాటి గవర్నమెంట్‌‌‌‌తో కొట్లాడిన. ఆత్మగౌరవాన్ని, శ్రమను, ధర్మాన్ని నమ్ముకున్న బిడ్డను నేను’’ అని మినిస్టర్ ఈటల చెప్పారు.

కట్టు కథలతో స్కెచ్ వేసి..

‘‘కొన్ని చానెల్స్‌‌‌‌లో కట్టుకథలతో, స్కెచ్‌‌‌‌ వేసి.. నా క్యారెక్టర్‌‌‌‌ను అసాసినేషన్‌‌‌‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల హృదయాల్లో సంపాదించుకున్న గౌరవాన్ని, ప్రేమని తుడిచిపెట్టి, విషం చల్లే పనిగా ఆరోపణలు చేస్తున్నారు. 2004లోనే నాకు 180 ఎకరాల భూమి ఉంది. ఇట్లాంటి చిల్లర ప్రచారాలను ప్రజలు నమ్మరు. రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాల అసైన్డ్‌‌‌‌ భూములు అమ్మారు? ఎవరు కబ్జాలకు పాల్పడ్డారో ఎంక్వైరీ చేయండి. నేను తీసుకున్నట్లు తేలితే ఏ శిక్షకైనా సిద్ధం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడను.. ప్రజలకు అనుకూలంగా మాట్లాడుతాను’’ అని అన్నారు.