
- కేంద్రమంత్రి బండి సంజయ్‌పై పరోక్ష విమర్శలు
- ‘కొడుకా’ అని సంబోధిస్తూ వార్నింగ్
- సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తానన్న ఈటల
- శామీర్‌పేటకు చేరిన హుజూరాబాద్ పంచాయితీ
కరీంనగర్, వెలుగు : బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సొంత పార్టీ లీడర్లపైనే అసమ్మతి రాగం ఎత్తుకున్నారు. హుజూరాబాద్ బీజేపీ నాయకులతో కలిసి శామీర్‌పేటలోని తన నివాసంలో శనివారం సమావేశమైన ఆయన పరోక్షంగా కేంద్రమంత్రి బండి సంజయ్‌ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమావేశానికి హాజరైన ఈటల అనుచరులు సైతం బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడడం ఇప్పుడు ఆ పార్టీలో కలకలం రేపుతోంది.
‘బీ కేర్ ఫుల్ కొడుకా’ అంటూ ఇన్‌డైరెక్ట్‌గా బండి సంజయ్‌ని ఉద్దేశించి ఈటల రాజేందర్ వాడిన పదజాలం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అంతేకాకుండా మల్కాజ్‌గిరి ఎంపీగా ఉంటూ... పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని సంప్రందించకుండా ‘నాకు ఇక్కడ లోకల్ బాడీ ఎన్నికలు లేవు. నాకు ఉన్న ఎన్నికలు హుజూరాబాద్ లోకల్ బాడీ ఎన్నికలే. అక్కడే మండలాల వారీగా ఆఫీసులు తెరుస్తా.. గెలిపించుకుంటా’ అని ఆయన మాట్లాడిన మాటలు చర్చకు దారి తీశాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో లోకల్ బాడీ ఎన్నికలు, సంస్థాగత నియామకాలు, పార్టీ కార్యక్రమాల విషయంలో స్థానిక ఎంపీకే పూర్తి ప్రాధాన్యత ఇవ్వడం బీజేపీలో ఆనవాయితీగా ఉంది. ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లో ఓడిపోయిన తర్వాత మల్కాజిగిరికి వెళ్లిపోయారు. ప్రస్తుతం బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సహజంగానే హుజూరాబాద్ స్థానిక ఎన్నికలు, పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత నియామకాల విషయంలోనూ స్థానిక ఎంపీకే పార్టీ ప్రాధాన్యమిస్తుంది. కానీ ఎంపీ ఈటల హుజూరాబాద్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సంజయ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డ ఈటల
ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించి భంగపడిన ఈటల రాజేందర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నప్పటికీ ఎక్కడా నోరు విప్పలేదు. ఈటల రాజేందర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్ పావులు కదిపారన్న అనుమానం ఆయన అనుచరుల్లో బలంగా ఉంది. ఈ క్రమంలోనే బండి సంజయ్ హుజూరాబాద్ వెళ్లిన సందర్భంలో వ్యక్తుల పేరుతో గ్రూపులు కడితే సహించనని, పార్లమెంట్ ఎన్నికల్లో కొందరు తనకు తక్కువ ఓట్లు రావాలని చూశారని, ఓడించాలని చూసిన వారికి స్థానిక సంస్థల్లో ఎలా టికెట్లు ఇవ్వాలని ప్రశ్నించడం ఈటలకు, ఆయన అనుచరులకు మరింత కోపం తెప్పించినట్లయింది.
హుజూరాబాద్ నియోజకవర్గంపై బండి సంజయ్ ఫోకస్ పెంచడంతో ఈటల అనుచరుల్లో అభద్రతాభావం పెరిగింది. అధ్యక్ష పదవి రాలేదని తీవ్ర నిర్వేదంలో ఉన్న ఈటలకు.. హుజూరాబాద్‌లో తన అనుచరుల అసంతృప్తి మరింత ఆగ్రహానికి కారణమైంది. ఇన్నాళ్లు కేంద్రమంత్రి బండి సంజయ్ విషయంలో ఎక్కడా నోరు విప్పని ఈటల.. శనివారం తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఓపెన్ అయ్యారు. ‘వాడెవడో సైకో, శాడిస్ట్.. వాడు ఎవడు, ఏ పార్టీలో ఉన్నడు, ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నడు.
బీకేర్ ఫుల్ కొడుకా.. శత్రువుతో కొట్లాడుతాం.. కానీ కడుపులో కత్తులు పెట్టుకొని కావలించుకునే సంస్కృతి మా రక్తంలో లేదు కొడుకా’ అంటూ ఫైర్ అయ్యారు. ‘ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో.. ఏమేం పెడుతున్నారో పైకి పంపించే ప్రయత్నం చేస్తా’ అని హెచ్చరించారు. కాగా ఈటల వాఖ్యలు బీజేపీలో తీవ్ర కలకలం రేపాయి. ఈ క్రమంలో శామీర్‌పేట సమావేశ వివరాలను ఇప్పటికే తెప్పించుకున్న రాష్ట్ర నాయకత్వం త్వరలోనే హైకమాండ్‌కు నివేదించే అవకాశముంది. ఆ తర్వాత అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
నాలుగేండ్లలో అనేక పదవులు
ఈటల రాజేందర్ 2021లో బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరినప్పటి నుంచి సముచిత ప్రాధాన్యమే దక్కింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాక బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, ఆ తర్వాత చేరికల కమిటీ చైర్మన్‌గా, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార కమిటీ చైర్మన్‌గా అవకాశం కల్పించింది. దేశంలోనే ఎవరికీ లేని విధంగా హుజూరాబాద్, గజ్వేల్ అసెంబ్లీ టికెట్లు ఇచ్చి బరిలో నిలిపింది. రెండు చోట్లా ఆయన ఓడిపోయినప్పటికీ... పార్టీలో సీనియర్లను కాదని, బీజేపీకి చాలా అనుకూలంగా ఉన్న మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్‌ను ఈటలకు ఇచ్చింది.
గెలిచిన తర్వాత లోక్‌సభలో ఆఫీస్ ఆన్ ప్రాఫిట్ కమిటీ చైర్మన్‌గా నియమించింది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఈటల అనుచరులుగా చెప్పుకుంటున్న వారే 60 శాతం పార్టీ పదవుల్లో ఉన్నారని ఆ పార్టీ జిల్లా నేతల వాదన. అయినా తమకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని, తమ నాయకుడు ఈటల రాజేందర్‌ను అణిచివేస్తున్నారని ఆయన అనుచరులు ప్రచారం చేయడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.