రూ.600 కోట్ల బకాయిలు మాత్రమే పెండింగ్ : ఈటల

రూ.600 కోట్ల బకాయిలు మాత్రమే పెండింగ్ : ఈటల

హైదరాబాద్‌ : ఆరోగ్యశ్రీలో పెండింగ్ బకాయిల కింద త్వరలో రూ.200 కోట్లు విడుదల చేస్తామన్నారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌. ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ భవనంలో ప్రైవేట్‌ హస్పిటల్స్ యాజమాన్యాల సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఆరోగ్య శ్రీ నెట్‌ వర్క్‌ ఆస్పత్రుల ప్రతినిధులు తమ సమస్యలను ఆరోగ్యశాఖ మంత్రికి తెలియజేశారు. పెండింగ్‌ లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఆరోగ్య శ్రీ బిల్లులను గ్రీన్‌ ఛానల్‌ లో చేర్చాలని డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల.. ప్రతి ఏటా కొంత బకాయిలు మరుసటి ఏడాదికి  వస్తుంటాయన్నారు. ఇప్పటికే నెట్వర్క్ ఆస్పత్రుల వారితో చర్చించామని… సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామన్నారు.ఆరోగ్యశ్రీలో అందించే సేవలకు ఇచ్చే బిల్లులను మరింత పెంచాలి అన్న నెట్వర్క్ ఆస్పత్రుల వారి డిమాండ్ పై ముఖ్య మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఈటల.  ఆరోగ్యశ్రీలో రూ. 600 కోట్ల బకాయిలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని..త్వరలో రూ.200 కోట్లు రిలీజ్ చేస్తామన్నారు ఈటల.

అయితే రూ. 800 కోట్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపిన ఆరోగ్య శ్రీ ట్రస్టు..కనీసం రూ.500 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఇదే విసయంపై నెట్ వర్క్ హస్పిటల్స్ ప్రతినిధి రాకేష్ మాట్లాడుతూ..పెండింగ్ లో మొత్తం రూ 1500 కోట్లు  ఉన్నాయని చెప్పారు. ఇప్పటివరకు రూ. 300 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారని…  ఈ అమౌంట్ ఒక్కో హస్పిటల్ కి 20 శాతం మాత్రమే వచ్చాయన్నారు.  సెప్టెంబర్ లో మిగతా మొత్తాలను విడుదల చేస్తామని గతంలో చెప్పారని.. ఇప్పుడు రూ.200 కోట్లే ఇస్తామంటున్నారన్నారు.  చర్చలు ఇప్పటికి ముగియలేదు కాబట్టి సేవలను నిలిపివేస్తున్నామని చెప్పారు రాకేష్.