
ఆయనను కలిస్తే పార్టీ హైకమాండ్
ఏమంటుందోనని భయం
వాట్సప్‌లో మాట్లాడుతున్న పలువురు నేతలు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కలిసేందుకు కొందరు టీఆర్ఎస్ నాయకులు జంకుతున్నారు. ఆయన ఎదురైనా చూసీచూడనట్లు వెళ్లిపోతున్నారు. ‘‘గులాబీ జెండా ఓనర్లం మేమే’’ అంటూ ఆగస్టు 29న మంత్రి ఈటల హుజురాబాద్ లో మాట్లాడిన మాటలు పార్టీలో దుమారం రేపాయి. అప్పట్నుంచి ఆయనను కలిసేందుకు టీఆర్ఎస్ నాయకులు పెద్దగా చొరవ చూపడంలేదు. వైద్యశాఖకు చెందిన పని ఉన్నా ఈటల దగ్గరకు వెళ్లడం లేదు. ఒకవేళ వెళ్తే ప్రగతిభవన్ వర్గాలు, తెలంగాణ భవన్ వర్గాలు ఏమంటాయోనని వారు భయపడుతున్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ‘‘గులాబీ జెండా ఓనర్ కేసీఆర్ మాత్రమే’’నని ఆగస్టు 31న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించారు.
అదే రోజు జలవిహార్ లో జరిగిన ఓ కార్యక్రమానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి మంత్రి ఈటల రాజేందర్ కూడా వెళ్లారు. ఈటలతో ఆ ఇద్దరు మంత్రులు పెద్దగా మాట్లాడలేదని, ఏదో విష్ చేశామా అంటే చేశామన్నట్లు పలుకరించారని కార్యక్రమానికి హాజరైన ఓ నాయకుడు తెలిపారు. ముగ్గురు మంత్రులు పక్కపక్కనే కూర్చున్నా.. అంత చనువుగా మాట్లాడుకున్నట్లు కనిపించలేదని అన్నారు. హుజురాబాద్ లో ఈటల మాట్లాడిన మరుసటి రోజే ఆయన ఇంటికి మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వెళ్లారు. ఈ ఇద్దరి భేటీపై మీడియాలో వార్తలు రావడంతో.. ఆ తర్వాత రోజు నుంచి రసమయి కూడా మళ్లీ ఈటలను కలువనట్లు తెలుస్తోంది.
ఈటలను కలుస్తున్న వారిపై నిఘా?
మంత్రి ఈటల రాజేందర్ ను కలుస్తున్న నాయకులపై నిఘా ఉందని టీఆర్ఎస్లో ప్రచారం జరుగుతోంది. మంత్రిని కలిసి ఏం మాట్లాడుతున్నారు? ఏ విషయాలు ప్రస్తావనకు వస్తున్నాయి? అని కొందరు పెద్దలు ఆరా తీస్తున్నట్లు గులాబీ కేడర్‌లో చర్చ నడుస్తోంది. రెండు రోజుల క్రితం తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తోపాటు మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు రాలేదు. మంత్రి ఈటల రాజేందర్ తన నియోజకవర్గంలోని ఫీవర్ ఆస్పత్రికి వస్తున్నారని, అందుకే పార్టీ మీటింగ్ కు రాలేదని తెలంగాణ భవన్ వర్గాలకు కాలేరు వెంకటేశ్ సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ కాలేరుపై సీరియస్ అయినట్లు తెలిసింది. పార్టీ మీటింగ్ కంటే ఆ కార్యక్రమం పెద్దదా అని ప్రశ్నిస్తూ.. సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలందరి నుంచి వివరణ తీసుకోవాలని పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆదేశించినట్లు సమాచారం.
ఎవరి దారి వారిదే..!
బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఆయనతోపాటు మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ హాజరయ్యారు. కార్యక్రమం పూర్తికాగానే మల్లారెడ్డి, రామ్మోహన్ ఎవరి దారిలో వారు వెళ్లిపోయారు. సహజంగా ఇద్దరు ముగ్గురు నాయకులు ఒకే కార్యక్రమానికి వెళ్తే కార్యక్రమం తర్వాత కాసేపు మాట్లాడుకుంటారు. కానీ.. అక్కడ అలాంటి సీన్ ఏమీ కనిపించలేదు. ఈటల ఆ కార్యక్రమం ముగించుకొని మరో కార్యక్రమానికి వెళ్లారు.
వాట్సప్ కాల్స్ కే పరిమితం!
ఈటలను నేరుగా కలిసి మాట్లాడితే ఎక్కడ తమపై పార్టీ సీరియస్ అవుతుందోనని కొందరు నేతలు వెనుకడుగు వేస్తున్నారు. ఫోన్లోనైనా పలుకరిద్దామనుకుంటే.. ఫోన్ ట్యాపింగ్ అవుతుందేమోనని భయపడుతున్నారు. వాట్సాప్ కాల్ చేస్తే పెద్దగా సమస్య ఉండదని భావించి.. ఆ మార్గంలో పలుకరిస్తున్నారు. హుజురాబాద్ ఘటన తర్వాత పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌ను వాట్సప్ లో అభినందించినట్లు సమాచారం. చాలా బాగా మాట్లాడరని.. అందరూ మెచ్చుకుంటున్నారని ఆయనను ప్రశంసించినట్లు తెలిసింది.