మంత్రిగా అభివృద్ధి చేయని ఈటల ఇప్పుడెలా చేస్తాడు?

మంత్రిగా అభివృద్ధి చేయని ఈటల ఇప్పుడెలా చేస్తాడు?
  • ఇల్లందకుంట సమావేశంలో మంత్రి హరీష్ రావు

కరీంనగర్: మంత్రిగా ఉండి అభివృద్ధి చేయలేకపోయిన ఈటల రాజేందర్ ఇప్పుడెలా చేస్తారని ఆర్ధిక మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. బుధవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రజలు అభివృద్ధి, సంక్షేమం కోరుకుంటున్నారని చెప్పారు. హుజూరాబాద్ లో ప్రజల ఘన స్వాగతం చూస్తుంటే గెల్లు శ్రీనివాస్ గెలిచిపోయినట్లేనన్నారు. ఎన్నికల్లో రాజకీయ నాయకులు గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలని ఆయన సూచించారు. కానీ ఇక్కడ బీజేపీ తరపున పోటీచేస్తున్న రాజేందర్ తనను చూసి ఓటువేయమంటున్నాడని పేర్కొన్నారు. ఆత్మగౌరవం కోసం చూస్తున్న ఈటల రాజేందర్ తాను ఆత్మవంచన చేసుకుని బీజేపీలో చేరాడని, ఆత్మవంచన చేసుకుంటూ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత ఈటెల రాజేందర్ కు లేదన్నారు. 
ఈటల రాజేందర్ కు ఓటువేస్తే ప్రజలకు ఏం చేస్తాడో సూటిగా సమాధానం చెప్పాలి
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ కు ఓటు వేస్తే ప్రజలకు ఏం చేస్తాడో సూటిగా సమాధానం చెప్పాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. మంత్రిగా ఉండి చేయలేని ఈటల.. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ పనిచేసేది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే, పేదింటి ఆడపిల్లల పెళ్లికి కల్యాణ లక్ష్మి, రైతులకు రైతు బంధు, వృద్ధులకు, వితంతువలకు ఆసరా ఫించన్లు ఇస్తున్నాం, మరి బీజేపీ వాళ్లు ఏం చేస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ లేదు, ఆ పార్టీ అడగంటి పోయింది, ఇక్కడున్నవి బీజేపీ, టీఆర్ఎస్ మాత్రమే, ఇక్కడ బీజేపీ ఏం చేసిందంటే పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచింది, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటు పరం చేసి, ఉన్న రిజర్వేషన్లు ఊడగొడుతోందన్నారు. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి, నిత్యావసర ధరలు పెంచిన బీజేపీ వైపు ఉంటారా? కేసీఆర్ వైపు ఉంటారా? మీరే నిర్ణయించుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు. కేంద్రం పెంచిన పెట్రలు, డీజిల్ ధరల వల్ల రైతులకు ట్రాక్టర్లు దున్నే కూలీ 3వేల రూపాయల రేట్లు పెరిగాయని, రైతు బంధు రూపంలో కేసీఆర్ డబ్బులిస్తుంటే.. కేంద్రం ధరలు పెంచి ఆ డబ్బులు లాక్కుంటోందన్నారు. ఈటల రాజేందర్ రైతుబంధు వద్దంటున్నాడు, మీకు కావాలా వద్దా..? ఆసరా ఫించన్లు పరిగే ఏరుకోవడమంటున్నారు ఈటల రాజేందర్, మరి మీకు కావాలా వద్దా? ఆసరా పరిగే అంటాడు, రైతుబంధు, దళితబంధు, కల్యాణ లక్ష్మి వద్దంటుండు,  మనం ఏం చేద్దామని ప్రశ్నించారు. రైతుబంధు వద్దని చెప్పిన ఈటల తన భూములకు 10 లక్షల 50 వేలు తీసుకున్నాడు.

ఒకవైపు రైతుబంధు వద్దని చెప్పిన ఈటల తన భూములకు 10 లక్షల 50వేలు తీసుకున్నాడని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బీజేపీలో చేరినంక  ఈటల రాజేందర్ కొత్త భాష నేర్చుకుంటున్నాడి, తనకు అన్నం పెట్టి, ఇన్ని పదవులిచ్చిన కేసీఆర్ ను పట్టుకుని “రా” అని సంబోధిస్తున్నడని, నన్ను పట్టుకుని ఒరేయ్ హరీశ్ అంటున్నడు, అదీ ఆయన సంస్కారం, నీలాగా నేను నా సంస్కారం తగ్గించుకోవాలనుకోవడంలేదు,నీ ఆస్తుల కోసం వామపక్ష భావాలను, నీ సిద్ధాంతాలను వదులుకుని బీజేపీలో చేరావు, నీ భాష మారినా.. మేము మాత్రం నిన్ను రాజేందర్ గారూ అనే సంబోదిస్తాం,నీవు అట్లా మాట్లాడావంటే.. నీలో ఓటమి ప్రస్టేషన్ కనిపిస్తోందని మాకు అర్థమైంది అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 

డబుల్ బెడ్రూం ఇండ్లు ఈటల రాజేందర్ ఎందుకు కట్టలేదు

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకు కట్టేలేదని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. సిరిసేడు గ్రామాన్ని దత్తత తీసుకున్న ఈటల రాజేందర్ .. కనీసం అక్కడైనా ఒక్క ఇల్లు కట్టలేదని, సీఎం కేసీఆర్ ఆరేళ్ల కింద హుజురాబాద్ కోసం 4 వేల ఇండ్లు మంజూరు చేస్తే.. రాజేందర్ ఎందుకు కట్టలేదు ? మా మంత్రులు తలసాని, తుమ్మల, నేను చాలా ఇండ్లు కట్టించి ప్రజలకు గృహ ప్రవేశం చేయించాము, మరి హుజురాబాద్ లో ఎందుకు గృహ ప్రవేశాలు కాలేదు అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నప్పుడే ఇవన్నీ చేయని వ్యక్తి.. ఇప్పుడు ఎలా చేస్తాడు, రాజేందర్ గెలిస్తే.. ఒక్క వ్యక్తిగా ఆయన గెలుస్తాడు. ప్రజలుగా మీరంతా ఓడిపోతారు, మీరు గెలుస్తారా? ఆయనను వ్యక్తిగా గెలిపిస్తారా ? బండి సంజయ్ ఎంపీగా గెలిచి రెండేళ్లైంది.. ఒక్క పది లక్షల పనైనా ఇక్కడ చేసాడా? ఎంపీగా బండి సంజయ్ ఎలాంటి పనిచేయలేదు.. ఇప్పుడు రాజేందర్ ఎలా చేస్తాడు.? ఇంతకాలం చేసిన పనులన్నా రాజేందర్.. సీఎం దయతోనే చేసాడు, బీజేపీలో చేరగానీ ఈటల రాజేందర్ పని అయిపోయింది, హుజురాబాద్ లో అభివృద్ధి కొనసాగాలంటే టీఆర్ఎస్ ను గెలిపించాలని ఆయన కోరారు. ఆగిపోయిన 4 వేల ఇండ్లు నిర్మించే బాధ్యత మేము తీసుకుని వాటిని పూర్తి చేస్తాం, సొంత జాగా ఉన్నవాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులిస్తాం అన్నారు.  కాళేశ్వరం నీళ్ల వల్ల తొమ్మిది నెలల పాటు ఈ ప్రాంతానికి నీరొచ్చిందా లేదా? గతంలో నీళ్ల కోసం ఎదురు చూసే రైతులు.. ఇప్పుడు బంద్ చేయమని అడుగుతున్నారు, అన్ని గ్రామాల్లో 25 లక్షలతో మహిళా సంఘ భవనాలు కట్టిస్తాం, టీఆర్ఎస్ వాళ్లు పైసలు పంచుతున్నారని ఈటల అబంఢాలు వేస్తున్నారు, టీఆర్ఎస్ గుర్తుపై గెలిచినోళ్లంతా టీఆర్ఎస్ లోనే ఉన్నారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

గడియారాలు, కుక్కర్లు, కుట్టుమిషన్లు, సెల్ ఫోన్లు పంచుతున్నారు

హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గడియారాలు, కుక్కర్లు, కుట్టు మిషన్లు, సెల్ ఫోన్లు పంచుతున్నారని.. ఆరుసార్లు పంచని గడియారాలు ఇప్పుడే ఎందుకు పంచుతున్నావు ? అంతేకాదు 9 కోట్లతో వెండి కుంకుమ భరిణలు తెప్పించాడట, 5 వేల కుట్టుమిషన్లు, 5 వేల గ్రైండర్లు, ప్రెషర్ కుక్కర్లు తెప్పించి ఆత్మగౌరవమా? 60 రూపాయల గడియారాలిస్తే.. ప్రజలంతా వాటిని నేలకేసి కొడుతున్నారు, చెప్పేటివి శ్రీరంగ నీతులు.. చేసేవి ఇలాంటి పనులు అని ఆయన ఎద్దేవా చేశారు. ఆషాడ మాసం బోనాలకు పోయినోళ్లకు గొర్రెపిల్లలు, మందు బాటిళ్లు పంచాడు ఈటల రాజేందర్, నీవే చెప్పేదొకటి, చేసేదొకటి, ఇవి వాస్తవాలు కాదా..? మేము మాత్రం కేసీఆర్ ఇస్తున్న పథకాలను నమ్ముకుని ముందుకు వెళ్తున్నామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

2 గుంటలు.. 200 ఎకరాల మధ్యే ఇప్పుడు పోటీ

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో  పోటీ 2 గుంటలు వర్సెస్.. 200 ఎకరాల మద్యే జరుగుతోందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఇప్పటికే ఎకరం అమ్మితే ఎన్నికల్లో గెలుస్తానని ఇప్పటికే ఈటల చెప్పాడు, భూమి అమ్మాడు ఇక్కడ పెడుతున్నాడు, గెల్లు శ్రీనివాసుకున్నది 2 గుంటలు, ఈటలకున్నది 200 ఎకరాలు, ఇప్పుడు పోటీ 2 గుంటలు వర్సెస్ 200 ఎకరాలు, తెలంగాణ కోసం పోరాడిన నాయకుడు గెల్లు శ్రీనివాస్. తెలంగాణ కోసం జైలుకు వెళ్లిన నాయకుడు శ్రీనివాస్, 21 ఏళ్ల పాటు పనిచేసిన గెల్లు శ్రీనివాస్ కు కేసీఆర్ తో పాటు, కెబినెట్ ఆశీర్వాదం ఉంది, గెల్లు శ్రీనివాస్ ను గెలిపిస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. ప్రజలు ఇంతకుముందు కారుకే వేసారు, ఇప్పుడు కూడా కారుకే ఓటువేయాలి, ఈటల రాజేందర్ పంచిన గడియారాల్లో కేవలం పువ్వు గుర్తు మాత్రమే పెట్టాడు, మోడీ బొమ్మ, అమిత్ షా బొమ్మ పెడితే పెరిగిన ధరలు, ఊడిన ఉద్యోగాలు గుర్తుకు వస్తాయని ఈటల మాయ చేయాలని చూస్తున్నాడని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, అందరికీ ఈటల ఇచ్చిన వస్తువులు తీసుకోండి.. కానీ ఒట్టు పెట్టుకోకండి, కుంకుమ భరణిలో పసుపు, కుంకుమ పెట్టి ఒట్టు పెట్టిస్తారు.. జాగ్రత్త, 2 గుంటలున్న గెల్లు శ్రీనివాస్ పేదోడు.. గెలిపించండి. మన గుర్తు కారు గుర్తు మరవద్దు, ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివద్ధి చేస్తామని మంత్రి హరీష్ రావు వివరించారు.