ఇథనాల్ ఫ్యాక్టరీతో ప్రమాదం ఉండదు : ఆర్.కృష్ణయ్య

ఇథనాల్ ఫ్యాక్టరీతో ప్రమాదం ఉండదు : ఆర్.కృష్ణయ్య
  • రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఫ్యాక్టరీని కొందరు అడ్డుకుంటున్నరు: ఆర్.కృష్ణయ్య

బషీర్​బాగ్, వెలుగు: ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల పర్యావరణానికి ప్రమాదం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. శనివారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్, భూపేశ్ సాగర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గద్వాల జిల్లా రాజోలి మండలం ధన్వాడ దగ్గర ఏర్పాటు చేయనున్న ఇథనాల్ ఫ్యాక్టరీపై కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టి దాడులు చేయించడం సరికాదన్నారు. 

ఫ్యాక్టరీని అడ్డుకుంటున్న నాయకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం అవుతుందని దుష్ప్రచారం చేస్తూ అడ్డుకోవద్దని కోరారు. 99 శాతం పరిశ్రమలు అగ్ర కులస్తులకే ఉన్నాయని, వారు బ్యాంక్ లోన్లు సైతం ఎగ్గొడుతున్నారని ఆరోపించారు. ఇథనాల్ పరిశ్రమ బీసీది అయినందుకే దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.