నాలెడ్జ్ ఉంటే సరిపోదు..ఎథిక్స్ ఉండాలి..నియామకాల్లో మెరిట్ ముఖ్యం.. మాల్‌‌ ప్రాక్టీస్‌‌ను సహించేది లేదు: సీపీ రాధాకృష్ణన్

నాలెడ్జ్ ఉంటే సరిపోదు..ఎథిక్స్ ఉండాలి..నియామకాల్లో మెరిట్ ముఖ్యం.. మాల్‌‌ ప్రాక్టీస్‌‌ను సహించేది లేదు:  సీపీ రాధాకృష్ణన్
  • పారదర్శకత ప్రజలకు కనిపించాలి
  • పీఎస్సీల చైర్మన్ల సదస్సులో మాట్లాడిన ఉపరాష్ట్రపతి

హైదరాబాద్, వెలుగు:  ‘‘దేశంలోని గవర్నెన్స్ క్వాలిటీని, నిజాయితీని నిర్ణయించడంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లదే కీలక పాత్ర. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ కలను సాకారం చేసుకోవాలంటే.. సివిల్ సర్వీసెస్ క్వాలిటీ చాలా ముఖ్యం. మెరిట్‌‌ను కాపాడటమే కాదు.. నియామక ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరిగిందనేది ప్రజలకు కనిపించాలి. పరీక్షల్లో మాల్‌‌ప్రాక్టీస్‌‌ను అస్సలు ఉపేక్షించొద్దు’’ అని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. 

హైదరాబాద్‌‌లో జరుగుతున్న ‘నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చైర్మన్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్’ ముగింపు సదస్సులో ఆయన శనివారం ప్రసంగించారు.  దేశాన్ని నడిపించే సమర్థులైన, నిజాయతీ గల వ్యక్తులను ఎంపిక చేసే బాధ్యత రాజ్యాంగబద్ధమైన పీఎస్సీలదేనని ఉపరాష్ట్రపతి అన్నారు. మెరిట్, నిష్పాక్షికత, పారదర్శకతను కాపాడటంలో కమిషన్ల స్వయంప్రతిపత్తి కీలకమని చెప్పారు. 

డిజిటల్ గవర్నెన్స్, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌మెంట్, క్లైమేట్ యాక్షన్, ఆర్థిక మార్పులు వంటి జాతీయ ప్రాధాన్యతలను అమలు చేయాలంటే.. ఇప్పుడు ఎంపికయ్యే అధికారుల నాణ్యతే నిర్ణయాత్మక శక్తి అని వెల్లడించారు. మూల్యాంకనంలో పక్షపాతం లేకుండా ‘అనానిమైజ్డ్ ఎవాల్యుయేషన్’ (పేర్లు తెలియకుండా పేపర్ల దిద్దడం) వంటి విధానాలు పాటించాలన్నారు. ‘‘ఏదో ఒకచోట చిన్న అవకతవకలు జరిగినా.. మొత్తం వ్యవస్థపైనే విశ్వసనీయత పోతుంది. అందుకే పబ్లిక్ పరీక్షల్లో మాల్‌‌ప్రాక్టీస్ విషయంలో ‘జీరో టాలరెన్స్’ పాటించాలి’’ అని హెచ్చరించారు.

ప్రవర్తనను కూడా పరీక్షించాలి..

ప్రస్తుత కాలంలో సమర్థవంతమైన పాలన అందించాలంటే సివిల్ సర్వెంట్లకు కేవలం అకడమిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోదని, నైతిక విలువలు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, లీడర్‌‌షిప్, టీమ్‌‌వర్క్ చేసే సత్తా ఉండాలని ఉపరాష్ట్రపతి  చెప్పారు. అందుకే రాత పరీక్షలతోపాటు.. అభ్యర్థుల ప్రవర్తన, నైతిక సామర్థ్యాలను అంచనా వేసేలా పీఎస్సీలు కొత్త విధానాలను పరిశీలించాలని సూచించారు. 

కేవలం రిక్రూట్‌‌మెంట్‌‌తోనే పని అయిపోలేదని, ఉద్యోగుల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష (పెర్ఫార్మెన్స్ అప్రైజల్), విజిలెన్స్ నిఘా పారదర్శకంగా ఉండాలని తెలిపారు. అప్పుడే సంస్థాగత సమగ్రతను కాపాడుకోగలమని చెప్పారు. దేశంలోని యువత టాలెంట్‌‌కు తగిన ఉద్యోగాలను కల్పించేలా ‘ప్రతిభ సేతు’ వంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టాలని పీఎస్సీలను కోరారు. 

దేశ పాలన వ్యవస్థకు వెన్నెముకలు: భట్టి విక్రమార్క

పబ్లిక్ సర్వీస్ కమిషన్లు దేశ పరిపాలనా వ్యవస్థకు వెన్నెముకలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. న్యాయమైన, పారదర్శకమైన, సమగ్ర నియామక విధానాల ద్వారానే ప్రజాసేవలో ప్రతిభకు సరైన స్థానం దక్కుతుందని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో వార్షిక క్యాలెండర్ తప్పనిసరిగా ఉండాలని, దానికి కట్టుబడి వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పరీక్షల్లో జాప్యం వల్ల యువతలో నిరాశ పెరుగుతోందని, అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందస్తు ప్రణాళికతో పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత కమిషన్లపై ఉందన్నారు. 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవంతంగా జాబ్ క్యాలెండర్ నిర్వహిస్తోందని అన్నారు. పారదర్శకతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ప్రాణమన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజ్‌‌లు ప్రజాసేవ విలువలకు విరుద్ధమని, ఇవి అభ్యర్థుల కలలను చిదిమేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. లీకేజీలను అడ్డుకునేందుకు ఆధునిక భద్రతా వ్యవస్థలు అమలు చేయాలని, సిబ్బందికి నైతిక విలువలపై శిక్షణ ఇవ్వాలని సూచించారు.

ఇంటర్వ్యూ లు కేవలం జ్ఞాన పరీక్షలకే పరిమితం కాకుండా వ్యక్తిత్వం, నైతికత, నిర్ణయ సామర్థ్యాన్ని అంచనా వేసేలా ఉండాలని సూచించారు. పక్షపాతానికి తావులేకుండా, న్యాయంగా ఇంటర్వ్యూలు నిర్వహించాలన్నారు. విభిన్న నేపథ్యాల నిపుణులతో ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కార్యక్రమంలో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం, ఇతర అధికారులు పాల్గొన్నారు.