- అప్రమత్తమైన విమానయాన శాఖ
- అంతర్జాతీయ మార్గాల్లో ఫ్లైట్లకు అంతరాయం
- అమల్లోకి అత్యవసర ఎయిర్ సేఫ్టీ చర్యలు
- ఢిల్లీలో మరింత పడిపోయిన కాలుష్యం
ఢిల్లీ: ఇథియోపియాలో దాదాపు 12,000 ఏళ్ల తర్వాత హెయిలీ గుబ్బి అగ్నిపర్వతం ఈ నెల 23న పేలిపోవడంతో, బూడిద మేఘాలు అధిక వేగం గాలులతో విస్తృత ప్రాంతాలకు విస్తరించాయి. 100–120 కి.మీ వేగంతో కదిలిన ఈ బూడిద మేఘాలు రెడ్ సీ దాటి, యెమెన్ మార్గంగా అరేబియా సముద్రంపైకి చేరి, మొదట గుజరాత్ వాయుకాశంలోకి ప్రవేశించాయి. అక్కడి నుంచి రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ వైపు కదిలాయి. ఇప్పటికే అధిక కాలుష్యంతో బాధపడుతున్న ఢిల్లీకి ఈ బూడిద మేఘాలు రాత్రి ఆలస్యంగా చేరడంతో అక్కడి వాతావరణ పరిస్థితి మరింత దిగజారింది. వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఈ బూడిద మేఘాలు సాయంత్రం 7:30 గంటలకల్లా భారత గగనతలం విడిచి చైనావైపు కదలుతాయని భారత వాతావరణ విభాగం భావిస్తోంది.
డీజీసీఏ అలర్ట్
ఈ పరిణామాల నేపథ్యంలో భారత విమానయాన నియంత్రణ సంస్థ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. అగ్నిపర్వత బూడిద ప్రభావిత ప్రాంతాలు, ఎత్తులు పూర్తిగా నివారించాలని, తాజా మార్గదర్శకాల ఆధారంగా ఫ్లైట్ ప్లానింగ్, రూటింగ్, ఇంధన నిర్వహణను వెంటనే మార్చాలని అన్ని ఎయిర్‌లైన్స్‌కు ఆదేశాలు ఇచ్చింది. అనుమానాస్పద బూడిద తాకిడి, ఇంజిన్ పనితీరు లోపాలు, క్యాబిన్‌లో పొగ లేదా వాసన గమనించిన వెంటనే రిపోర్ట్ చేయాలని స్పష్టమైన సూచనలు అందించింది. బూడిద మేఘాల ప్రభావంతో ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ సహా ప్రధాన ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు దెబ్బతిన్నాయి.
హెయిలీ గుబ్బి అగ్నిపర్వతం పేలుడు నేపథ్యంలో కొన్ని ప్రాంతాలపైగా ప్రయాణించిన విమానాలపై అదనపు భద్రతా తనిఖీలు చేయడానికి ఎయిర్ ఇండియా 11 విమానాలను రద్దు చేసింది. న్యూయార్క్–ఢిల్లీ, దుబాయ్–హైదరాబాద్, దోహా–ముంబై, దుబాయ్–చెన్నై, దమ్మామ్–ముంబై, దోహా–ఢిల్లీ, చెన్నై–ముంబై, హైదరాబాద్–ఢిల్లీ వంటి పలు అంతర్జాతీయ విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. భారత గగనతలాన్ని దాటి పోతున్న ఈ బూడిద మేఘాలు మరికొన్ని గంటల్లో దేశానికి ప్రమాదం లేకుండా తొలగిపోవచ్చని అధికారులు చెబుతున్నప్పటికీ, ఉత్తర భారత వాతావరణంపై దీని తాత్కాలిక ప్రభావం స్పష్టంగానే కనిపిస్తోంది.
