శిథిల ఇండ్లపై ఫోకస్ .. బోధన్ భీంగల్ పట్టణాల్లో పాడుబడ్డ ఇండ్లు 245

శిథిల ఇండ్లపై ఫోకస్ .. బోధన్ భీంగల్ పట్టణాల్లో పాడుబడ్డ ఇండ్లు 245
  • ఖాళీ చేయించేందుకు ఆఫీసర్ల కసరత్తు
  • గ్రామాల్లో పాత ఇండ్ల పరిస్థితిపై అధ్యయనం 

నిజామాబాద్, వెలుగు : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన ఇండ్లల్లో ఉండే కుటుంబాలను జిల్లాయంత్రాంగం ఖాళీ చేయిస్తుంది. నగరంలోని కార్పొరేషన్​తో పాటు  మూడు మున్సిపాలిటీల్లో 245 పురాతన ఇండ్ల యజమానులకు పది రోజుల గడువు ఇచ్చి ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. రిపేర్లు చేస్తే వినియోగించుకోవడానికి వీలున్న ఇండ్లను మినహాయించి మిగతా వాటిని ఖాళీ చేయించాలని నిర్ణయించారు. వారికి స్థానికంగా ప్రభుత్వ భవనాల్లో వసతి కల్పించనున్నారు. వర్షాలతో ఇండ్లు కూలితే ప్రాణనష్టం జరుగుతుందని ఓనర్లను ఒప్పిస్తున్నారు. గ్రామ పంచాయతీల పరిధిలో 50 ఏండ్లు దాటిన ఇండ్ల వివరాలు సెక్రటరీల నుంచి ఆఫీసర్లు సేకరిస్తున్నారు. 

ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రయారిటీ.. 

నిజామాబాద్​ నగర కార్పొరేషన్ పరిధిలో 73,670 ఇండ్లు ఉండగా వాటిలో 195 గృహాలు నివాసయోగ్యంగా లేవని ఇంజినీర్లు తేల్చారు. ఇందులో 114 నగరంలో ఉండగా, విలీన గ్రామాలైన గూపన్​పల్లి, ముబాకర్​నగర్, కేశాపూర్, మాణిక్​భండార్, దాస్​నగర్, బోర్గాం(కే), ఖానాపూర్, కలూర్, సారంగాపూర్, నెహ్రూనగర్​లో 81 ఇండ్లు ఉన్నట్టు లెక్కతేల్చారు.  ఆర్మూర్​ మున్సిపాలిటీలో 25, బోధన్​లో 15, భీంగల్ టౌన్​లో పది ఇండ్లు వర్షాల ప్రభావంతో కూలే చాన్స్ ఉన్నట్లు నిర్ధారించారు. వర్షం నీటికి నానిన పైకప్పు, గోడలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు. 

వాటిలో సుమారు వెయ్యి మంది దాకా ఉన్నారని లెక్కలు వేసి, మున్సిపల్ కమిషనర్లు నోటీసులు ఇచ్చి షిఫ్టింగ్​కు రెడీ అయ్యారు.  వారిలో అర్హతగల కుటుంబాలు ఈ వర్షాకాలం మూడు నెలలు సర్దుకుంటే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేలా భరోసా ఇచ్చారు. ఇండ్లు ఖాళీ చేసే పేదలకు వార్డు ఆఫీస్​లు, అంగన్​వాడీ సెంటర్లు, స్కూల్ రూమ్స్ తదితర సర్కార్ బిల్డింగ్​లు ఉపయోగించాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.  గ్రామ పంచాయతీల్లో సర్వే చేసి  మూడు రోజుల్లో వివరాలు పంపించాలని సెక్రటరీలకు ఆదేశాలు అందాయి.

షెల్టర్ ఇవ్వడానికి రెడీ..

నగరంలో  శిథిలావస్థకు చేరిన ఇండ్లు ఉన్నాయి. ఖాళీ చేయాలని ఓనర్లకు నోటీసులు ఇచ్చాం.  వారి కుటుంబాల సేఫ్టీ కోసమే యాక్షన్​లోకి దిగాం. తామే వచ్చి కూల్చేదాకా  చూడొద్దు.   ఇండ్లు ఖాళీ చేస్తే వారికి ప్రభుత్వపరమైన షెల్టర్ ఇవ్వడానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది.  

 శ్రీనివాస్​, అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్​