మలక్‭పేట ఎఫెక్ట్: నిమ్స్‭కు బాలింతల తరలింపు

మలక్‭పేట ఎఫెక్ట్: నిమ్స్‭కు బాలింతల తరలింపు

మలక్‭పేట ప్రభుత్వాస్పత్రిలో బాలింతలు మృతి చెందిన ఘటన మరువకముందే పేట్ల బురుజు మెటర్నిటీ ఆస్పత్రిలో పలువురు బాలింతలు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. పేట్ల బురుజు మెటర్నిటీ ఆస్పత్రి నుంచి నలుగురు సీ సెక్షన్ జరిగిన బాలింతలను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్యం కోసమే వారిని తరలించామని ఆస్పత్రి సూపరింటెండెంట్ మాలతి తెలిపారు. మరోవైపు బాలింతల పరిస్థితి స్టేబుల్‭గానే ఉందని నిమ్స్ వైద్యులు వెల్లడించారు. వీరితో పాటు మరో ఇద్దరు, ముగ్గురు బాలింతలను నిమ్స్ ‭కి తరలిస్తున్నారని సమాచారం. అయితే.. దీనిపై వైద్యుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. 

ఈ ఉదయం మలక్‭పేట ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందిన విషయం తెలిసిందే.. తీవ్ర అస్వస్థతకు గురై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు బాలింతలు మృతి చెందారు. ఈ ఘటపై స్పందించిన ఆస్పత్రి సూపరింటెడెంట్ త్రిలోక్.. ఇద్దరు బాలింతలకు ఈ నెల 11న సి సెక్షన్  చేశామని చెప్పారు. అందులో ఓ మహిళకు12న 4 గంటలకు... హార్ట్ రేట్ పడిపోయిందని, వెంటనే గాంధీకి రిఫర్ చేశామన్నారు. ఆమె గాంధీలో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందిందని చెప్పారు. ఇంకో మహిళకు అప్పటికే  హైపో థైరాడిజం ఉండడంతో... 12న రాత్రి షుగర్ లెవల్స్ పడిపోవడంతో గాంధీకి తరలించారని, ఆమె కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందిందని తెలిపారు. ఈ కేసుల్లో వైద్యుల నిర్లక్ష్యం లేదని, ఆపరేషన్‭కి ముందు అన్ని పరీక్షలు చేశామని ఆయన స్పష్టం చేశారు.