
- అవరోహణ, ఆరోహణ క్రమాన్ని కూడా గుర్తించలేకపోతున్నరు
- 51 శాతం మందికి తీసివేతలు, 44 శాతం మందికి గుణకారాలు, భాగహారాలు తెలుసు
- పరాఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ్ సర్వేలో వెల్లడి
- గతంతో పోలిస్తే మెరుగైన తెలంగాణ ర్యాంకు
- 36వ స్థానం నుంచి 26వ ప్లేస్‌కు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మూడో తరగతి విద్యార్థులకు రెండంకెల కూడికలు, తీసివేతలు కూడా సరిగా రావడం లేదు. కనీసం ఆరోహణ, అవరోహణ క్రమాన్ని కూడా గుర్తించలేకపోతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో సగం మంది విద్యార్థుల పరిస్థితి ఇలాగే ఉందని పరాఖ్ రాష్ర్టీయ సర్వేక్షణ్ సర్వేలో తేలింది. గతంతో పోలిస్తే విద్యా నాణ్యతలో తెలంగాణ ర్యాంకు మెరుగుపడడం కాస్త ఊరటనిచ్చే అంశం.
విద్యార్థుల్లోని సామర్థ్యాలను గుర్తించేందుకు కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో నిరుడు డిసెంబరు 4న దేశవ్యాప్తంగా 3, 6, 9వ తరగతి విద్యార్థులకు పరాఖ్ రాష్ర్టీయ సర్వేక్షణ్ (నాస్) పరీక్షలు నిర్వహించింది. తెలంగాణలో 3,296 స్కూళ్లలో పరీక్షలు నిర్వహించగా.. 10,821 మంది టీచర్లు, 78,464 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన రిపోర్టును కేంద్ర విద్యా శాఖ మంగళవారం (జులై 08) వెబ్ సైట్లో పెట్టింది.
మన రాష్ట్రంలో 2021 నాస్ సర్వే రిపోర్టుతో పోలిస్తే తాజాగా ర్యాంకు కాస్త మెరుగైనా.. జాతీయ స్థాయి ర్యాంకులతో పోలిస్తే ఇంకా వెనుకబడే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్లతో పాటు కొత్తగా నియామకాలు, వసతుల కల్పన వల్ల కొంత మేలు జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. పక్కనున్న ఏపీతో పోలిస్తే తెలంగాణ కాస్త మెరుగ్గా ఉంది. 2021 నాస్ సర్వే రిపోర్టులో మూడో తరగతిలో మన రాష్ట్రం జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు సాధించగా.. ప్రస్తుతం 26వ స్థానానికి ఎగబాకింది. 6వ తరగతిలో 26వ స్థానంలో, 9వ తరగతిలో17వ స్థానంలో నిలిచింది.
తద్వారా చివరి పది రాష్ర్టాల లిస్టు నుంచి తెలంగాణ బయటపడినట్టు అయింది. మూడో తరగతిలో మాతృభాష సబ్జెక్టులో జాతీయ సగటు 64 శాతం ఉంటే, తెలంగాణ 58 శాతానికే పరిమితమైంది. మ్యాథ్స్‌లో జాతీయ సగటు 60 శాతం ఉండగా, తెలంగాణ సగటు 54 శాతంగా ఉంది. లాంగ్వేజీ, మ్యాథ్స్ లో పనితీరు జాతీయ సగటు కంటే 6 శాతం తక్కువగా ఉంది.
గ్రామీణ విద్యార్థులు భాషలో 4 శాతం, గణితంలో 3 శాతం తక్కువ స్కోరు సాధించగా, పట్టణ విద్యార్థులు రెండు సబ్జెక్టులలో 6 శాతం తక్కువ స్కోరు చేశారు. ఆరో తరగతిలో లాంగ్వేజీలో జాతీయ సగటు 57శాతం, తెలంగాణ సగటు 53 శాతంగా ఉంది. మ్యాథ్స్ లో జాతీయ సగటు 46 శాతం, తెలంగాణ సగటు 44 శాతంగా ఉంది. ఇది లాంగ్వేజీలో 4 శాతం, గణితంలో 2 శాతం జాతీయ సగటు కన్నా తక్కువ.
9వ తరగతిలోలాంగ్వేజీలో జాతీయ సగటుతో సమానంగా ఉండగా, గణితంలో 1, సైన్స్‌లో 1, సామాజికశాస్త్రంలో 2 శాతం తక్కువ పనితీరు ఉంది. మూడో తరగతి పిల్లలకు అవరోహణ, ఆరోహణ క్రమంలో 99 వరకూ ఉన్న సంఖ్యలను కేవలం 48 శాతం మాత్రమే రాయగలిగారు. 51 శాతం మందికి మాత్రమే తీసివేతలు వస్తాయి. రాష్ట్రంలో 44 శాతం మంది మాత్రమే గుణకారాలు, భాగారాలు సరిగా చేస్తున్నారు.