ఇంకా కేసీఆరే సీఎం అట!

ఇంకా కేసీఆరే సీఎం అట!
  •     తెలుగు పుస్తకాల్లో మార్పులు చేయని ఎస్సీఈఆర్టీ 
  •     పంపిణీ ఆపెయ్యాలని ఉన్నతాధికారుల ఆదేశాలు
  •     అధికారుల నిర్లక్ష్యంతో ఏటా తప్పులు  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్​సీఈఆర్టీ) అధికారుల తీరు మారడం లేదు. పోయినేడాది టెన్త్ క్లాస్ పుస్తకాల్లో రాజ్యాంగ పీఠికనే మార్చేయగా.. ఈ ఏడాది ఏకంగా సీఎం, మినిస్టర్, విద్యాశాఖ అధికారుల పేర్లనే మార్చేశారు. ప్రభుత్వం మారినా ఇంకా కేసీఆరే సీఎం అంటూ పాఠ్య పుస్తకాల్లో ముద్రించారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా బడులు ఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలో పుస్తకాలు పంపిణీ చేశారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు పుస్తకాల్లోని ముందుమాటలో తప్పులు దొర్లాయి. 

సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అని, విద్యాశాఖ కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య అని, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ చిరంజీవులు అని అందులో ఉంది. అది చూసి టీచర్లు, స్టూడెంట్లు అవాక్కయ్యారు. నిరుడు డిసెంబర్ లోనే కాంగ్రెస్ అధికారంలోకి రాగా, పుస్తకాల్లో మాత్రం మాజీ సీఎం కేసీఆర్ పేరు పేర్కొన్నారు. అంతేకాకుండా 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా కడియం శ్రీహరి ఉండగా ఆయన పేరునే కొనసాగించారు. ఆ సమయంలోనే పనిచేసిన విద్యాశాఖ అధికారుల పేర్లనూ అలాగే ఉంచారు. 

దీన్ని బట్టి కనీసం పుస్తకాల్లోని ముందుమాటను కూడా ఎస్​సీఈఆర్టీ అధికారులు పరిశీలించడం లేదని స్పష్టమవుతున్నది. పైగా ఎస్​సీఈఆర్టీ అధికారులు తమ తప్పు ఒప్పుకోకపోగా, దాన్ని సమర్థించుకుంటున్నారు. డిసెంబర్ కంటే ముందే కంటెంట్ రెడీ చేసుకున్నామని, మార్చిలో ప్రింటింగ్ కు ఇచ్చామని చెబుతున్నారు. అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకు ప్రింటింగ్ కు ఇచ్చినప్పటికీ, పుస్తకాల్లో అప్​డేట్ చేయలేదు. ఎస్​సీఈఆర్టీ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై టీచర్లు మండిపడుతున్నారు. కాగా, ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి పోవడంతో తెలుగు పుస్తకాల పంపిణీని ఆపెయ్యాలని హెడ్మాస్టర్లకు ఆదేశాలిచ్చారు. 

తప్పులు చేస్తున్నా చర్యల్లేవ్.. 

ఎస్సీఈఆర్టీ అధికారులు గతంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పోయినేడాది టెన్త్ సోషల్ స్టడీస్ పుస్తకాల్లో రాజ్యాంగ పీఠికను మార్చేశారు. దీన్ని కూడా టీచర్లు గమనించిన తర్వాత.. దానిపై స్టిక్కర్లు వేయాలంటూ ఆదేశాలిచ్చారు. ఇంతపెద్ద తప్పు జరిగినా ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. ప్రీఫైనల్ పరీక్షల విషయంలో, సిలబస్ విషయంలో, డైట్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చే విషయంలో, అకడమిక్ క్యాలెండర్ తయారీ విషయంలో.. ఇలా అనేక అంశాల్లోనూ తప్పులు దొర్లాయి. కానీ, వారెవరిపైనా అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. రేవంత్ సర్కారైనా అధికారులపై చర్యలు తీసుకోవాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.