- వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలో కొనసాగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పనులను రానున్న మూడు నెలల్లోగా పూర్తి చేసేలా చూడాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత కింద బుద్ధారం పెద్ద సముద్రానికి సంబంధించి 101 ఎకరాలు, గణప సముద్రానికి సంబంధించి 164 ఎకరాలు, తూముకుంట, సంగినేనిపల్లి కాల్వలకు సంబంధించిన 94 ఎకరాల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. జిల్లాస్థాయి నెగోషియేషన్ కమిటీని ఏర్పాటు చేసి, తేదీలు ఖరారు చేసుకుని క్షేత్రస్థాయిలో రైతులతో సమావేశాలు నిర్వహించి నష్టపరిహారంపై చర్చించాలని సూచించారు. ఈ కమిటీ సమావేశాల సమాచారాన్ని ముందస్తుగానే రైతులకు అందించాలని, జూలై మొదటి వారంలోగా ఆయా భూములకు సంబంధించిన అవార్డుల ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు.
రూ.5,990 కోట్ల వార్షిక రుణ ప్రణాళిక విడుదల
బ్యాంకులు జిల్లాలోని రైతులు, విద్యార్థులు, స్వయం ఉపాధి లబ్ధిదారులకు రుణాలు అందించడంలో మరింత చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ సమీక్షా సమావేశంలో రూ.5,990 కోట్ల వనపర్తి జిల్లా వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణాల మంజూరులో సిబిల్ స్కోర్‌ను ఒక ప్రామాణికంగా పరిగణించినప్పటికీ, అర్హులైన పేదలు, విద్యార్థులు, రైతుల దరఖాస్తులు తిరస్కరణకు గురికాకుండా బ్యాంకులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. గత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన రూ.5,339 కోట్ల రుణ లక్ష్యానికి గాను రూ.4,943 కోట్లు (92.58 శాతం) మంజూరు చేశామని లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్ వివరించారు.
