- ఆర్ అండ్ ఆర్ కమిషనర్
గద్వాల, వెలుగు: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా వివిధ ప్యాకేజీల పరిధిలో 534 ఎకరాల భూమి సేకరణ ప్రక్రియను రాబోయే 45 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు ఆదేశించారు. మంగళవారం గద్వాల కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్‌తో కలిసి సంబంధిత అధికారులతో ఆయన భూసేకరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులపై సమీక్షించేందుకు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారని, ఆయా ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ ఆలస్యం కావడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారని ఆయన తెలిపారు.
గట్టు లిఫ్ట్ కింద 462 ఎకరాలు, ఆర్డీఎస్ పరిధిలోని తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ఫేజ్-2 లో భాగంగా నిర్మిస్తున్న మల్లమ్మకుంట రిజర్వాయర్ కోసం 567 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందన్నారు. నెట్టెంపాడు లిఫ్ట్ ప్రారంభమై చాలా ఏండ్లు అవుతున్నందున దీని భూసేకరణకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, కోర్టు కేసుల్లో లేని 220 ఎకరాలకు ఈ నెల 15వ తేదీలోగా ప్రిలిమినరీ డిక్లరేషన్ ఇవ్వాలని స్పష్టం చేశారు.
