మక్తల్, వెలుగు: నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్‌లోని చారిత్రక నిలువురాళ్ల ఎకో టూరిజం పార్కు అభివృద్ధి పనులకు మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముడుమాల్ నిలువురాళ్లకు యూనెస్కో శాశ్వత గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ వారసత్వ సంపదను పరిరక్షించడంతో పాటు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు.
దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ చైర్మన్ వేద కుమార్ మాట్లాడుతూ 3 వేల ఏండ్ల కిందటే ఆదిమానవులు నక్షత్ర మండలాన్ని నిలువురాళ్ల రూపంలో రూపొందించారని, ఈ చారిత్రక విశిష్టతను విద్యార్థులకు, ప్రజలకు తెలియజేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి రూ. 20 కోట్లతో చేపట్టిన చిట్యాల - గజరం దొడ్డి బ్రిడ్జి కమ్ బారేజ్ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మక్తల్ మండలం పసుపుల గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో రూ. 50 లక్షలతో చేపట్టనున్న మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పనులను నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
