నారాయణపేట, వెలుగు: శాస్త్రీయ వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యమని, రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నామని నారాయణపేట కలెక్టర్ ప్రియాంక తెలిపారు. మంగళవారం నారాయణపేట మండలంలోని జాజాపూర్ రైతు వేదికలో రైతు నేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆమె చూశారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు నేస్తం కార్యక్రమం విజయవంతంగా చేరవేస్తోందన్నారు.
ప్రతి మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలు, నిపుణులు నేరుగా రైతులతో మాట్లాడి తెగుళ్ల నివారణ, నీటి యాజమాన్యం, సేంద్రీయ సాగు వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. అనంతరం జిల్లాలో ముగ్గురు ఆదర్శ రైతులు, ఇద్దరు వ్యవసాయ విస్తరణ అధికారులను సన్మానించారు. రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను పరిశీలించారు.
