పీవోకేలో నిరసనకారులపై కాల్పులు 30 మంది మృతి.. మరో 200 మందికి గాయాలు

పీవోకేలో నిరసనకారులపై కాల్పులు 30 మంది మృతి.. మరో 200 మందికి గాయాలు
  • ఎన్నికల కోటా, ఆర్థిక ఇబ్బందులపై కొన్నాళ్లుగా జనం నిరసనలు
  • ఆందోళనలను అణచివేసేందుకు పాక్​ దళాల కాల్పులు

రావల్​కోట్: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) మరోసారి రణరంగంగా మారింది. స్థానిక ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న ప్రముఖ పౌర సమాజ కూటమి ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జాక్)’ పై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించడంతో నిరసనలు ఉధృతమయ్యాయి. నిరసనకారులను అణచివేసేందుకు పాకిస్తాన్ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 30 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోగా, సుమారు 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

 గత శుక్రవారం (జూన్ 05) రాత్రి రావల్ కోట్ నగరంలో భద్రతా దళాల చేతిలో ఒక స్థానిక వ్యాపారి మరణించాడు. ఆదివారం సదరు వ్యాపారి మృతదేహాన్ని ఉంచిన ఆసుపత్రి మార్చురీ వెలుపల జాక్ మద్దతుదారులు భారీ సంఖ్యలో గుమిగూడారు. శాంతిభద్రతల సమస్యను నెపంగా చూపిస్తూ నిరసనకారులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు, సైన్యం ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఒక్కసారిగా పెరిగింది.

  • హింసాత్మకంగా మారిన నిరసనలు

భద్రతా దళాలు నిరసనకారులపై పెల్లెట్స్, టియర్ గ్యాస్, లైవ్ బుల్లెట్లతో విరుచుకుపడ్డాయి. దీంతో ఆగ్రహించిన నిరసనకారులు ఆటోమేటిక్ రైఫిళ్లు, పెట్రోల్ బాంబులతో ఎదురుదాడికి దిగినట్లు స్థానిక కమిషనర్ సర్దార్ వహీద్ ఖాన్ తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇరువర్గాల ఘర్షణలో ఆరుగురు నిరసనకారులు మరణించినట్లు చెబుతున్నప్పటికీ, వాస్తవానికి మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని స్థానిక ప్రజలు, జాక్ నేతలు ఆరోపిస్తున్నారు.

  • ఎన్నికల కోటా, ఆర్థిక ఇబ్బందులపై పోరాటం

జులై 27న పీవోకే అసెంబ్లీకి జరగబోయే ఎన్నికలలో మొత్తం 45 స్థానాలకు గాను 12 స్థానాలను శరణార్థుల (నాన్-కాశ్మీరీ పాకిస్తానీయుల) కోసం రిజర్వ్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జాక్ నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతోపాటు ఈ ప్రాంతంలో తీవ్రమైన విద్యుత్ కొరత, విపరీతమైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఇంటర్నెట్ నిలిపివేత, స్థానిక వనరులను పాకిస్తాన్ దోచుకుంటోందంటూ కొంతకాలంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.

  • హక్కుల సంఘాల ఆందోళన

పౌర హక్కుల కోసం పోరాడుతున్న ఒక సంస్థను తీవ్రవాద ముఠాగా ముద్రవేసి నిషేధించడాన్ని పాకిస్తాన్ మానవ హక్కుల సంఘం (హెచ్చార్సీపీ) తీవ్రంగా తప్పుపట్టింది. మరోవైపు, పీవోకేలో పాక్ భద్రతా దళాలు సాగిస్తున్న ‘తీవ్ర పోలీసు అనాగరికతను’ భారతదేశ విదేశాంగ శాఖ (ఎంఈఏ) ఖండించింది.