
- కురుస్తున్న కుశ్నపల్లి స్కూల్ స్లాబ్
- మంచిర్యాల జిల్లాలో విద్యార్థుల తిప్పలు
బెల్లంపల్లి రూరల్, వెలుగు : మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని కుశ్నపల్లి జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ స్టూడెంట్లు గొడుగుల పట్టుకుని చదువుకుంటున్నారు. పన్నెండేండ్ల కింద కట్టిన స్కూల్ బిల్డింగ్ స్లాబ్ వర్షాలకు కురుస్తుండడంతో ఈ దుస్థితి నెలకొంది. ఇక్కడ 6 నుంచి 10వ క్లాస్ వరకు 55 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. బడికి ఐదు తరగతి గదులు అవసరం కాగా, మూడే ఉన్నాయి.
వీటిలో రెండు క్లాస్ రూమ్స్ స్లాబ్ పగుళ్లు తేలి కురుస్తున్నాయి. దీంతో స్టూడెంట్లను మిగిలిన క్లాస్ రూమ్స్తో పాటు వరండాలో, డైనింగ్ హాల్లో కూర్చోబెట్టి పాఠాలు చెప్తున్నారు. ఐదు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో స్లాబ్ నుంచి నీళ్లు కారి మీద పడుతున్నాయి. దీంతో పిల్లలు బుక్స్వేరే చోట పెట్టి గొడుగులు పట్టుకుని పాఠాలు వింటున్నారు.
గత సర్కారు హయాంలో ‘మన ఊరు - మన బడి’లో రిపేర్లు చేసినప్పటికీ క్లాస్ రూమ్స్ కురుస్తూనే ఉన్నాయని, వర్షాలకు రూ.6 లక్షల విలువైన డిజిటల్ టీవీ పాడైపోయిందని టీచర్లు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించి రిపేర్లు చేయడంతో పాటు అదనపు గదులు
నిర్మించాలని కోరుతున్నారు.