నన్ను ఓడించేందుకు 5వేల కోట్లు ఖర్చు చేస్తారట

నన్ను ఓడించేందుకు 5వేల కోట్లు ఖర్చు చేస్తారట
  • ఉరుములు వచ్చినా.. పిడుగులు పడ్డా.. నా గెలుపును ఆపలేరు
  • కేసీఆర్ వస్తవా.. రా.. నామీద పోటీ చెయ్: మాజీ మంత్రి ఈటల రాజేందర్

కరీంనగర్ జిల్లా: ‘‘నన్ను ఓడించేందుకు 5 వేల కోట్లయినా ఖర్చు చేస్తారట.. బక్క పల్చటి పిలగాడు, దిక్కులేని పిలగాడని నన్ను అనుకుంటున్నావ్. ? నేను దిక్కులేని వాన్ని కాదు.. హుజురాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డను నేను.. హరీశ్.. వస్తవా.. రా.. ఇక్కడ పోటీ చేద్దాం.. కేసీఆర్.. నా మీద పోటీ చేయ్..’’ అని మాజీ మంత్రి ఈటల సవాల్ చేశారు. ఉరుములు వచ్చినా.. పిడుగులు పడ్డా.. నా గెలుపును ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
ఆదివారం హుజురాబాద్ మండలం చెల్పూర్ లో పెద్ద ఎత్తున ముదిరాజ్ కులస్తులు, హుజురాబాద్, జమ్మికుంట మండలాలకు చెందిన యూత్ నాయకులు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఈటల కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ పదేసి లక్షలు దళిత బంద్ ఇచ్చినా, గొర్రెలిచ్చినా, కులాలవారిగా తాయిలాలిచ్చినా.. ‘‘ఈటల’’ వాళ్ల గుండెళ్లో ఉన్నాడన్నారు. రేపు ఉరుములు వచ్చినా, పిడుగులు పడ్డా నా గెలుపును ఆపలేరు.. రేపు ఎన్నికల్లో చూసుకుందామని ధీమా వ్యక్తం చేశారు. 
 ప్రజల ఓట్లతో వచ్చిన పదవులతో వాళ్లకు ద్రోహం చేస్తే కర్రు కాల్చి వాతపెడతారు
ప్రజల ఓట్లతో వచ్చిన పదవులతో వాళ్లకే ద్రోహం చేస్తూ.. చూస్తూ ఊరుకోరని.. కుర్రు కాల్చి వాతపెడతారని మజీ మంత్రి ఈటల హెచ్చరించారు. ‘‘గతంలో ఏనాడు ఈ నియోజవర్గంలో కనిపించని మంత్రులు ఇప్పుడు ఎందుకు వస్తున్నట్లు..? వాళ్ల ప్రేమంతా మీ ఓట్లపైనే...  నన్ను కాపాడుకుంటరా.. చంపుకుంటరా మీ ఇష్టం..  ఎక్కడ దు:ఖం ఉన్నా, ఆపద ఉన్నా అక్కడుండే బిడ్డను నేను.. దళితుల ఓట్ల మీద తప్ప.. హుజురాబాద్ దళితులపై కేసీఆర్ పై ప్రేమ లేదు.. హైదరాబాద్ ఎన్నికల సమయంలో వరదలొస్తే ఇంటికి పది వేలు ఇస్తానన్న కేసీఆర్.. ఓట్లయ్యాక.. ఆ హామీ నెరవేర్చలేదు.. ఒడ్డెక్కదాకా ఓడమల్లన్న.. ఒడ్డెక్కినాక బోడమల్లన్న రకం కేసీఆర్..’’ అని మాజీ మంత్రి ఈటల పేర్కొన్నారు. 
ధాన్యం కొనకపోతే రైతులు ఆగమైతరు.. ఫించన్లు, రేషన్ కార్డులివ్వమని అడిగినందుకే నాపై కోపం
ధాన్యం కొనకపోతే రైతుల బతుకులు ఆగమైతయని,  ఆసరా ఫించన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని కోరినందుకే నామీద కేసీఆర్ కోపం పెంచుకున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కమ్యూనిటీ హాళ్లకు, దేవాలయాలకు నిధులిస్తే తప్పులేదు. ఆ సొమ్మంతా మీదే తీసుకోండి. తెల్లబట్టలో పసుపు, బియ్యం పెట్టి ప్రమాణం చేయిస్తారు... అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండండి.. ఏమిచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం పువ్వు గుర్తుకు వేయాలని ఆయన కోరారు. గతంలో నేను పనిచేస్తేనే ఇక్కడి ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు గెలిచారనే విషయం మరవొద్దని ఆయన సూచించారు.