బతుకమ్మ వేడుకులకు ఏర్పాట్లు శూన్యం

బతుకమ్మ వేడుకులకు ఏర్పాట్లు శూన్యం

బతుకమ్మ వేడుకలకు చెరువుల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా..జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోలేదు. భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్పై బతుకమ్మ వేడుకలకు కనీస ఏర్పా్ట్లు కూడా చేయలేదు. సరూర్ నగర్ చెరువు దగ్గర గతంలో కట్టిన మెట్లే ఉన్నాయి. అవీ కూడా సగం దెబ్బతిన్నాయి. బతుకమ్మ సంబరాల సందర్భంగా  వాటికి కనీసం మరమ్మతులు నిర్వహించలేదు. 

చెరువులో చెత్త దర్శనం..
సరూర్ నగర్  చెరువులో ఎక్కడికక్కడ చెత్త కనిపిస్తోంది. గతంలో ఏర్పాటు చేసిన మెట్ల వెంబడి చెత్త దర్శనమిస్తోంది. వినాయక నిమజ్జనం తర్వాత చెరువు నుంచి చెత్త తొలగించలేదు. ఇక మెట్లు అయితే అధ్వాన్నంగా ఉన్నాయి. దిగేందుకు కూడా అనువుగా లేవు. బతుకమ్మ వేడుకుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా కూడా..సరూర్ నగర్ చెరువు దగ్గర మాత్రం జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కనీస సౌకర్యాలైన మంచినీరు, ఇతర సిబ్బందిని కూడా కల్పించలేదు. 

ఏర్పాట్లు చేయకపోవడంపై ఆగ్రహం.. 
బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని ఆదేశాలు జారీచేసిన అధికారులు పట్టించుకోవడం లేదని బతుకమ్మ ఉత్సవ నిర్వాహకులు కంది కంటి ప్రేమనాథ్ గౌడ్ ఆరోపించారు.  బతుకమ్మ లు చెరువులో వేసేందుకు కనీసం మెట్లు కూడా ఏర్పాటు చేయలేదన్నారు. అధికారులకు ఫోన్లు చేసి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. సరూర్ నగర్ చెరువులో దాదాపు 10వేల మంది ఆడబిడ్డలు ఇక్కడకు వస్తారని తెలిపారు. కానీ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని..సొంత ఖర్చులతో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసుకున్నామన్నారు.