రద్దు చేసిన కార్డుల్లో ఇప్పటికీ పది శాతం కూడా కంప్లీట్ చేయలే

రద్దు చేసిన కార్డుల్లో ఇప్పటికీ పది శాతం కూడా కంప్లీట్ చేయలే

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో 2016లో రద్దు చేసిన రేషన్​ కార్డు లబ్ధిదారుల్లో అర్హులైన వారిని గుర్తించేందుకు చేస్తున్న సర్వే ముందుకు సాగడం లేదు. ఈ నెల 20 లోపు ఫీల్డ్ లెవల్​ సర్వే పూర్తి చేసి, నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సివిల్​ సప్లై కమిషనర్​ నుంచి ఆదేశాలు వచ్చాయి. వర్షాలు, వరదల కారణంగా సర్వే లేట్ అవుతోంది. ఖమ్మం జిల్లాలో 2016లో 9 వేల రేషన్​ కార్డులను రద్దు చేశారు. సరైన వెరిఫికేషన్​ చేయకుండానే అనర్హులుగా ప్రకటించి రేషన్​ కార్డులను తొలగించారంటూ కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లగా, రీ సర్వే చేసి అర్హులకు తిరిగి రేషన్​ కార్డులు మంజూరు చేయాలని ఈ నెల మొదటి వారంలో కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఈ నెల 5న సివిల్ సప్లై అధికారులు రీ సర్వే కోసం ఆర్డర్స్​ ఇచ్చారు. ఈ నెల 20లోగా ఈ ప్రాసెస్​ కంప్లీట్ చేయాలని ఆదేశించినా, ఆ గడువు దాటి వారం కావస్తున్నా ఇప్పటి వరకు 10 శాతం వెరిఫికేషన్​ కూడా పూర్తి కాలేదు.

800 కార్డులకే సర్వే కంప్లీట్

జిల్లాలో ప్రస్తుతం 4 లక్షల 16 వేల రేషన్​కార్డులున్నాయి. ఇందులో 3 లక్షల 89 వేల ఆహార భద్రత కార్డులు, 27 వేల అంత్యోదయ కార్డులున్నాయి. ఇక 2016లో రాష్ట్రవ్యాప్తంగా 19 లక్షల రేషన్ కార్డులను ఒకేసారి ప్రభుత్వం రద్దు చేయగా, ఇందులో ఖమ్మం జిల్లాలో 9వేల కార్డులు రద్దయ్యాయి. ఈ 9 వేల మంది ఇళ్లకు వెళ్లి విచారణ చేసింది. 2016లో కార్డులు తొలగించిన సమయంలో పాటించిన నిబంధనల మేరకే మళ్లీ ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని ప్రకారం రూ.2 లక్షల ఆదాయం, 5 ఎకరాల లోపు పొలం ఉన్నవాళ్లు అర్హులు. అలాంటి వారిని గుర్తించి అర్హులు, అనర్హుల జాబితాను సిద్ధం చేసి గ్రామపంచాయతీ వారీగా నోటీస్​ బోర్డులపై ప్రకటించాల్సి ఉంటుంది. వారంలోగా అభ్యంతరాలను తీసుకొని లిస్టును స్టేట్  సివిల్  సప్లై డిపార్ట్ మెంట్ కు పంపించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం 800  రేషన్ కార్డులకు సంబంధించి ఫీల్డ్ వెరిఫికేషన్​ కంప్లీట్  చేశారు. కొన్ని మండలాల్లో ఇంకా సర్వే మొదలుపెట్టలేదని తెలుస్తోంది. రెండు వారాలు కంటిన్యూగా వర్షాలు పడడం, కొంత మంది సిబ్బందికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరద సహాయక చర్యలకు సంబంధించిన డ్యూటీలు వేయడం వల్ల సర్వే ఆలస్యమైందని ఆఫీసర్లు చెబుతున్నారు. 

కొత్త కార్డుల కోసం వెయిటింగ్..

జిల్లాలో కొత్త రేషన్​ కార్డుల కోసం 25 వేల మందికి పైగా అప్లై చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కొన్ని కార్డులు మాత్రమే మంజూరు చేయడంతో మిగిలిన వారు కొత్తకార్డుల కోసం వెయిట్ చేస్తున్నారు. మరోవైపు రేషన్​ కార్డుల్లో ఎన్నో ఏళ్ల నుంచి పిల్లల పేర్లు చేర్చకపోవడంతో పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఐదేళ్లలోపు పిల్లల పేర్లను రేషన్​ కార్డుల్లో తొలగించారు. వాళ్ల వయసు ఇప్పుడు పదేళ్లు దాటుతున్నా కార్డుల్లో చేర్చడం లేదు. ఇదిలాఉంటే ఆరోగ్య శ్రీ కార్డు లేని వారు అత్యవసర పరిస్థితుల్లో రేషన్​ కార్డులో పేరు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. రెవెన్యూ ఆఫీసర్ల చుట్టూ తిరిగి లెటర్​ తీసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రీ సర్వే జరుగుతోంది

గతంలో రద్దయిన కార్డులకు సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రీ సర్వే చేస్తున్నాం. జిల్లాలో 9 వేల కార్డులకు గాను ఇప్పటి వరకు 800 కార్డులకు సంబంధించిన వెరిఫికేషన్​ పూర్తయింది. వర్షాల వల్ల పనులు కాస్త ఆలస్యమయ్యాయి. త్వరలోనే పూర్తి ప్రాసెస్ కంప్లీట్ చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. 

- రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి, ఖమ్మం