- నోటిఫై చేయని కేంద్ర హోంశాఖ
- ప్రత్యామ్నాయాలపై ఉన్నతాధికారులతో సీఎం మంతనాలు
- మొదట కేంద్ర హోం మంత్రికి లేఖ రాయాలని..
- స్పందించకుంటే సీబీఐ విచారణ కోసం సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయం
- అవినీతి జరిగిందంటూనే కేంద్రం సీబీఐకి పర్మిషన్ ఇవ్వకపోవడంపై నారాజ్
హైదరాబాద్, వెలుగు : కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించి ఏడు నెలలు గడుస్తున్నా కేంద్రం నోటిఫై చేయకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం లక్ష కోట్లు నీళ్ల పాలు చేసిందని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్, కాళేశ్వరం కుంగిపోయిందని దాంతో ఎలాంటి ఉపయోగం లేదని రాష్ట్రం నుంచి ఉన్న మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా ప్రకటనలు చేస్తున్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో కేంద్రం మీనమేషాలు లెక్కిస్తున్నది.
ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ, జస్టిస్ చంద్రఘోష్, విజిలెన్స్‌తోపాటు ఇతర రిపోర్ట్‌ల ఆధారంగా ఏం చేయాలనే దానిపై సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమాలోచనలు చేసినట్టు తెలిసింది. రాజకీయ విమర్శలు పక్కనపెట్టి నిజంగానే అవినీతిపై చర్యలు తీసుకోవాలంటే కేంద్రం వెంటనే స్పందించాలని మరోసారి రాష్ట్రం కోరనున్నది.
ఇందుకోసం కేంద్ర హోం శాఖకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున లేఖ రాయాలని భావిస్తున్నారు. తర్వాత కూడా ఎలాంటి కార్యాచరణ మొదలు కాకుంటే కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ రాష్ట్రం తరఫున సుప్రీంకోర్టును అభ్యర్థించే యోచనలో ఉన్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వాలు సిఫార్సు చేసిన కేసుల విషయంలో సీబీఐకి కేంద్రం నోటిఫై చేయకపోతే.. ఏ రకంగా ముందుకు వెళ్లారనే వివరాలను సీఎం తెప్పించుకొని స్టడీ చేస్తున్నట్టు సమాచారం.
- కేంద్రం ఓకే అంటేనే సీబీఐ ముందుకు
సీబీఐ.. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే సంస్థ కావడంతో ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్-1946 ప్రకారం విచారణకు కేంద్రం నుంచి నోటిఫికేషన్ తప్పనిసరి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో సీబీఐ ప్రవేశంపై నిషేధం విధించగా, ప్రస్తుత ప్రభుత్వం కేవలం కాళేశ్వరం కేసు కోసం ప్రత్యేకంగా మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో పలు అంతర్రాష్ట్ర అంశాలు ముడిపడి ఉండడం, వివిధ ప్రభుత్వ సంస్థలు పాలుపంచుకోవడంతో ఈ కేసును సీబీఐకే అప్పగించాలని ప్రభుత్వం భావించింది.
నిందితులుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులు, కాంట్రాక్టు కంపెనీలపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. సీబీఐ దర్యాప్తు ప్రారంభించడానికి రాష్ట్రం నుంచి ‘జనరల్ కన్సెంట్’ లేదా స్పెషల్ నోటిఫికేషన్ ఉన్నా కేంద్ర పర్మిషన్ లేనిదే అడుగు ముందుకు పడదు. అందుకే ఈ జాప్యంపై న్యాయ నిపుణులతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చిస్తున్నారు. కేంద్రం సహకరించని పక్షంలో చట్టపరంగా ఉన్న ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
- గతేడాది సెప్టెంబర్ 1న సీబీఐకి..
వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ నిరుడు సెప్టెంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ కాపీ అందినట్టు సీబీఐ నుంచి అక్నాలెడ్జ్‌మెంట్ కూడా వచ్చినప్పటికీ, ఇంతవరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. నిర్మాణ దశలో జరిగిన అవినీతి, అక్రమాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ప్రభుత్వం అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసి పంపింది.
ఘోష్ కమిషన్ నివేదికతోపాటు ఎన్డీఎస్ఏ సాంకేతిక రిపోర్టులు, విజిలెన్స్ కమిటీ ఇచ్చిన ఆధారాలను కూడా ఇప్పటికే సీబీఐకి అందజేశారు. సాధారణంగా ఇలాంటి ప్రాధాన్యత ఉన్న కేసుల్లో అభ్యర్థన అందిన వెంటనే సీబీఐ ప్రాథమిక పరిశీలన చేసి దర్యాప్తు మొదలుపెడుతుంది. కానీ ఈ కేసులో ఏడు నెలలు గడిచినా కేంద్ర ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ రాకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే అనుమానాలను సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయమై ఇప్పటికే పలు వేదికల్లో ఆరోపణలు కూడా చేశారు.
- అవినీతి జరిగిందంటూనే..
కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే యుద్ధప్రాతిపదికన విచారణ జరిపించి, నిందితులను కటకటాల్లోకి పంపిస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ సహా బీజేపీ నేతలు మాట్లాడుతూ వచ్చారు.ఈ క్రమంలో కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంతో అప్పట్లో కేంద్రమంత్రులు, బీజేపీ నేతలంతా దీనిని స్వాగతిస్తూ పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పించారు. ఇటీవల పార్లమెంట్‌లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపమే కారణమని ఆరోపించారు.
ప్రాజెక్ట్ లోపాలపై కేంద్ర బృందం అధ్యయనం చేస్తున్నదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్ష కోట్ల ప్రజాధనం గంగలో పోశారని విమర్శించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ‘‘కాళేశ్వరాన్ని కేసీఆర్ కుటుంబం ఓ ఏటీఎంలా వాడుకుంది. ఇంజినీర్లను కూడా అడగకుండా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు. రూ.లక్షకోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేశారు. కేసీఆర్‌ను జైల్లో పెడతానన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఏం చేశారు’’ అంటూ మాట్లాడారు.
తీరా కేసును కేంద్రం నోటిఫై చేయకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. అందులో భాగంగానే మొదట హోంమినిస్టర్‌కు లేఖరాయాలని, అప్పటికీ కేంద్రం నుంచి స్పందన రాకుంటే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నదని ఓ ఉన్నతాధికారి ‘వెలుగు’తో చెప్పారు. కాగా, ఈ అంశంపై అన్ని కోణాల్లో సీఎం లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్టు తెలిసింది.
