బీడీలు చుట్టి చదివించిన అక్క...ఒకేసారి 5 ఉద్యోగాలకు ఎంపికైన చెల్లి

బీడీలు చుట్టి చదివించిన అక్క...ఒకేసారి 5 ఉద్యోగాలకు ఎంపికైన చెల్లి

చిన్నతనంలోనే  తల్లిదండ్రులు  చనిపోయారు. అయినవాళ్లు దూరం పెట్టారు. ఆడ పిల్లలు  ఏం చేస్తారులే  అని చిన్న చూపు చూశారు. కానీ  అనుకుంటే కానిది  ఏముంది అన్నట్లు ... దూరం పెట్టిన వాళ్లే  దగ్గరయ్యేలా ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు జగిత్యాల జిల్లాకు  చెందిన  ఇద్దరు అక్క చెల్లెళ్లు. ఇంతకీ ఆ అక్కాచెల్లెళ్లు ఏం చేశారు? వారు సాధించింది ఏంటీ ? ఇక వివరాల్లోకి వెళ్తే...

జగిత్యాల జిల్లా రాయికల్ లోని రుద్ర భూమేశ్వర్, మమత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వారి పేర్లు రమ్య, రచన. పెద్ద కూతురు రమ్యకు ఐదేళ్లు, రచనకు నెల వయసు ఉన్నప్పుడే తండ్రి భూమేశ్వర్ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో నెల పసికందు రచన, ఐదేళ్ల రమ్యతో పుట్టిళ్లు అయిన తాండ్రియల్ కు వెళ్లింది మమత. కుటుంబ భారం ఆమెపైనే పడడంతో బీడీలు చుడుతూ పిల్లలను సాకింది. వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే వారిని చదివించింది. దురదృష్టవశాత్తు రమ్య పదో తరగతిలో ఉండగానే తల్లి మమత కూడా కన్నుమూసింది. దీంతో అక్కాచెల్లెళ్లిద్దరూ అనాదలయ్యారు. ఓ వైపు చదువుకోవాలని ఆశ ఉన్నా... వారికి సాయం చేసే వాళ్లు లేకపోయారు. దీంతో  అక్క రమ్య బీడీలూ చుడుతూ చెల్లెలు రచనను చదివించింది.

తాను చదువుకుంటూ బీడీలు చుడుతూ ఆదివారాలు, సెలవు రోజుల్లో కూలి పని చేస్తూ రమ్య తన చెల్లెలు రచనను చదివించింది. కానీ రోజురోజుకు ఖర్చులు పెరగడంతో తామ ఇద్దరం చదవలేమని రమ్య భావించింది. తన చెల్లెలు చదువు కోసం తాను డిగ్రీ సెకండియర్ లో చదువు మానేసి మానేసింది. పూర్తిగా చెల్లెలు చదువుకోసం కష్టపడింది. బీడీలు చుడుతూనే  కొంతకాలం విద్యావాలంటీర్ గా కూడా పని చేసింది. అనుకోని పరిస్థితుల్లో చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకున్న రమ్య... చెల్లెలు చదువుకు ఆటంకం కలగకుండా ఉండేందుకు రచనను జగిత్యాల బాలసదన్ లో ఉంచి పదో తరగతి వరకు చదివించింది.

పదో తరగతి పూర్తి చేసిన రచన... పాలిటెక్నిక్ లో సీటు సంపాదించింది. హైదరాబాద్ లోని స్టేట్ హోమ్ లో ఉండి పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసింది. తర్వాత ఈ-సెట్ రాసిన  ఆమె హైదరాబాద్ సీబీఐటీలో  లో సీటు సంపాదించింది. ఐతే అడ్మిషన్ ఫీజు కట్టలేని పరిస్థితిలో అప్పటి జగిత్యాల కలెక్టర్ శరత్ ను కలవగా.. అతను తన సిబ్బందితో కలిసి అడ్మిషన్ ఫీజు కట్టి వారికి అండగా నిలిచారు. 

బీఈ పూర్తి పూర్తి చేసిన రచన.. కాలేజీ క్యాంపస్ సెలక్షన్లలో ఏకంగా 5 కంపెనీల్లో ఉద్యోగాలు సాధించింది. మంచి సాలరీతో ఉద్యోగాలు వచ్చినా... ఆమె మాత్రం తన తల్లి ఆశయం నెరవేర్చేదిశగా సివిల్స్ కు ప్రిపేర్ అవుతానని చెబుతోంది. ఎంతటి కష్టం అయినా భరించి సివిల్స్ ర్యాంకు సాధిస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది రచన. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా.. అయినవారు ఆదరించకపోయినా.. అనుకున్న లక్ష్యం కోసం కృషి చేస్తున్న ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 

వీ6 కథనానికి స్పందన...

చదువు మానేసి బీడీలు చుడుతూ చెల్లెలు రచనను ఇంజినీరింగ్  చదివించిన కథలాపూర్ మండలం తాండ్రియాలకు చెందిన రమ్య కథనాన్నివీ6 లో చూసి స్పందించిన కోరుట్ల అరుణోదయ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ ప్రవీణ్. డిస్ కంటిన్యూ చేసిన డిగ్రీ పూర్తయ్యేదాకా రమ్య ఫీజు తానే చెల్లిస్తానని ఆయన హామీ ఇచ్చారు.