- రోజూ మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అమలు
- మండల విద్యాశాఖ అధికారులు, ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు వంద శాతం పఠన సామర్థ్యం ఉండాలనే ఉద్దేశ్యంతో ఈనెల 27నుంచి ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మండల విద్యాశాఖ అధికారులు, ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమంపై సమీక్షించారు.
కార్యక్రమ అమలుపై దిశా నిర్దేశం చేశారు. ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అనే కార్యక్రమం పాఠశాల సమయాల్లో మాత్రమే అమలు చేసేలా డిజైన్ చేసినట్లు తెలిపారు. రోజూ మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థుల రీడింగ్ స్కిల్స్ పెంచేందుకు టీచర్లు పట్టుదలతో కృషి చేయాలన్నారు. ఇంగ్లీష్ భాష ఫోనెటిక్స్ బేసిక్ గా ఈ కార్యక్రమం డిజైన్ చేసినట్లు తెలిపారు. చిన్న, చిన్న పదాలతో ఫోనోటిక్ సౌండ్ నేర్పించాలని సూచించారు.
సులువైన పదాలతో ప్రారంభించి సరళంగా ఇంగ్లీష్ చదివే సామర్థ్యం వచ్చేలా మెటీరియల్ తయారు చేసినట్లు చెప్పారు. రోజూ టీచర్ యాక్టివిటీ, స్టూడెంట్ యాక్టివిటీ, ఒక స్టోరీ చెబుతూ పిల్లలను ఇంట్రాక్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అనే కార్యక్రమాన్ని నెల రోజుల పాటు సరిగ్గా అమలు చేస్తే ప్రతి విద్యార్థికీ చదివే సామర్థ్యం వస్తుందని చెప్పారు. ప్రతీ బుధవారం విద్యార్థి రీడింగ్ స్కిల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో వాస్త పరిస్థితులను యాప్ లో అప్ డేట్ చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో విద్యా శాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సీహెచ్ రామకృష్ణ, సీఎంఓ ప్రవీణ్, ఆర్ఎంఓ ప్రభాకర్ రెడ్డి, మండల విద్యా శాఖ అధికారులు, టీచర్లు పాల్గొన్నారు.
